
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలు వేరే పార్టీకి అవకాశం ఇచ్చినా మనకు గౌరవ ప్రదమైన స్థానాలు కట్టబెట్టారు. ప్రజలు మనకు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దాం. ఓటమితో అధైర్య పడకుండా జనంలో ఉంటూ ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడుదాం..’అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. గెలుపొందిన ఎమ్మెల్యేలను కేటీఆర్ అభినందించారు. ఓటమి పాలైన అభ్యర్థులకు ధైర్యంగా ఉండి కలిసి పనిచేద్దామంటూ భరోసా ఇచ్చారు.
ప్రజల నుంచి సానుకూల స్పందన
‘ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం విషయంలో ఒక సానుకూల స్పందన వస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. తెలంగాణ బాగు కోరుకున్న అనేక మంది భావోద్వేగానికి గురవుతూ సందేశాలు పెడుతున్నారు. ఓటమితో నిరాశ చెందకుండా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుదాం.
రెండు మూడురోజుల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదాం. ప్రభుత్వంలో, అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్ కేంద్రంగా విధులు, కార్యకలాపాలు కొనసాగించిన మనమంతా ఇకపై తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందాం’అని కేటీఆర్ అన్నారు.
నేతల భావోద్వేగం
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు భావోద్వేగానికి గురయ్యారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా పార్టీ అడుగుజాడల్లో నడిచిన తాము ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పలువురు నేతలు కేటీఆర్, కవితతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. వందలాది మంది తెలంగాణ భవన్‌కు తరలిరావడంతో పరిసరాలు సందడిగా కనిపించాయి.
సుమారు మూడు గంటల పాటు తెలంగాణ భవన్‌లోనే గడిపిన కేటీఆర్ కొందరితో గ్రూపుగా, మరికొందరితో ముఖాముఖి సంభాషించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కృష్ణారావు, గోపీనాథ్, వివేకానంద, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment