![KTR Comments On Congress Party - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/30/ktr.jpg.webp?itok=JaWCrGy-)
చేవెళ్లలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్
చేవెళ్ల, వికారాబాద్: ‘ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి పోయినంత మాత్రాన బాధ పడేది ఏమీ లేదు.. మీరు అండగా ఉండండి చాలు.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల్లో చాకుల్లాంటి కొత్త నాయకులను తయారు చేసుకుందాం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్‌లో సోమవారం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’’ప్రజలు పదేళ్లు మనకు అధికారం ఇచ్చారు. వంద స్పీడ్‌తో కారు పాలన జోరుగా సాగింది. కారు ఇప్పుడు సర్వీసింగ్‌కు వెళ్లింది అంతే.. బాధపడాల్సిన పనిలేదు. గ్రామాల్లో కారు ఓవర్ లోడ్ అయిన మాట వాస్తవమే. అందుకే దిగిపోయే ముగ్గురు, నలుగురు నాయకులను వెళ్లిపోనిద్దాం,. పోయే వాళ్లను బతిమిలాడాల్సిన పని లేదు’’అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గైర్హాజరు..
చేవెళ్లలో నిర్వహించిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య గైర్హాజరయ్యారు. ఆదివారం రాత్రి ఇంట్లో మెట్లపై కాలుజారి పడటంతో గాయమైందని అందుకే ఆయన సమావేశానికి రాలేకపోయారని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నేవీ రాడార్ ఏర్పాటు ప్రమాదకరం!
’’వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్న వెరీలో ఫ్రీక్వెన్వీ రాడార్ స్టేషన్ ప్రజలకు, వన్య ప్రాణులకు ఎంతో ప్రమాదకరం.. దీని నుంచి వెలువడే రేడియేషన్ ఈ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మేము అధికారంలో ఉన్న పదేళ్ల పాటు నేవీ రాడార్ ఏర్పాటును అడ్డుకున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు వేల ఎకరాల భూమి తీసుకుని.. 12 లక్షల చెట్లు నరికేసి ఇక్కడ ఏర్పాటు చేసే నేవీ రాడార్ స్టేషన్‌తో ఈ ప్రాంతానికి ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఈసీ, మూసీ నదులకు జన్మస్థానమైన ఈ ప్రదేశంలో ఇలాంటి రాడార్ స్టేషన్ ఏర్పాటు తగదని సూచించారు.
అలాగైతే కవితపై అసలు కేసే పెట్టేవారు కాదు..
బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని అందుకే కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని, బీజేపీతో తాము జతకలిస్తే అసలు కవితపై కేసే పెట్టి ఉండేవారు కాదని కేటీఆర్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీస్మార్‌ఖాన్‌లు.. ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ పోటీ చేసిన చోట కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెడితే.. వారిని ఓడించింది బీఆర్‌ఎస్ కాదా..? అని ప్రశ్నించారు.
హామీలపై కాంగ్రెస్‌ను వదిలేది లేదు..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వదిలిపేట్టేది లేదు.. బట్టలు ఊడదీసి చేవెళ్ల గడ్డపైనే నిలబెడుదాం అని కేటీఆర్ అన్నారు. గడిచిన యాభై రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కావాల్సినంత వ్యతిరేకతను మూటకట్టుకుందని తెలిపారు. మార్పు కావాలనుకున్న ప్రజలే ఇప్పుడు బాధపడుతున్నారని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న ప్రభుత్వం వచ్చిందని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సాధారణ కార్యకర్త కన్నా అధ్వానంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మన నాయకుడు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తారని కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై అకారణంగా నోరు పారేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. సందీప్‌రెడ్డితో కేటీఆర్ సోమవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకుంటామనీ, బీఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసానిచ్చారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రతి ఒక్కరిపైన నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న మంత్రి తాజాగా జెడ్పీ చైర్మన్‌పై అదే నోటి దురుసు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తీరును ప్రజలు గమనిస్తున్నారనీ, ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment