సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏదో కొత్త హామీలు అన్నట్లు మాట్లాడారని.. మోదీ చేసిన మోసానికి కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్‌ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపైనా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘‘తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీతో సభ నిర్వహించడం అనైతికం. వివేక్, కొండ విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రాజ్ గోపాల్ రెడ్డి అందుకే రాలేదు అనే చర్చ నడుస్తోంది. మోదీ పర్యటన ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదు. కుటుంబ దోపిడీ(బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి..) గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు?. దీంతో.. బీఆర్‌ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మోదీ తెలంగాణ పర్యటన.. అని రేవంత్ అన్నారు.
👊కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఇద్దరు ఏకమైన చేస్తున్న పర్యటనలు ఇవి. కేటీఆర్ ,హరీష్ రావు బిల్లా రంగాల్లా తిరుగుతున్నారు. 2004,2009 కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో నేను వస్తా. 2014,18 మ్యానిఫెస్టోలతో చర్చలకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్.
👊2004నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. కానీ, ఈ బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశిస్తూ..) కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్. 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఆరు హామీలను వైఎస్సార్ అమలు చేసి చూపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేసి చూపాం.
👊రాష్ట్రాల ఆదాయం, ప్రజల అవసరాలనుబట్టి పథకాలు ఉంటాయి. కానీ, ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం విలువ తెలియదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు... ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరికీ సూటిగా సవాల్ విసురుతున్నా. మా పదేళ్ల పాలన.. మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?. మీరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు.
👊కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటే తప్పేంటి?. బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముంది?. అయినా రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో సీఎం లు మారారా?. మాట ఇస్తే అమలు చేసే పార్టీ కాంగ్రెస్.. ఆనాడు అమలు చేశాం. ఇప్పుడూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తాం. కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదు.
👊తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మదు.. క్షమించదు. కర్ణాటక ప్రభుత్వం వసూళ్లపై కేటీఆర్ కి అనుమానం ఉంటే విచారణకి లెటర్ రాస్తే దాన్ని ఆమోదించి విచారణ చేయించాలని నేను కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లపై విచారణ జరిపించాలని లెటర్ రాస్తాను. ఆమోదించి విచారణ జరిపిస్తారా? అని నిలదీశారు రేవంత్. అలాగే.. ఓట్ల కోసమే కేటీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నాడంటూ విమర్శించారు రేవంత్.
👊కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా. భయం తో ఉచిత సిలిండర్లు ,సన్న బియ్యం రేషన్ , రైతు లకు పెన్షన్ లాంటి హామీ లు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. బీఆర్ఎస్ పనైపోయింది ,ప్రభుత్వం లో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు. టిక్కెట్ ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుంది. టిక్కెట్ ల ప్రకటన నాటి కి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ లు మా పార్టీ లోకి వస్తున్నారంటేనే మా బలం ఏంటో అర్దం అవుతుంది. బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదు.
👊రాష్ట్రంలో 19% ఓట్లు అన్ డిసైడ్ లో ఉన్నాయి..ఇందులో మెజారిటీ ఓటు షేర్ మాకే వస్తుంది. సౌత్ ,నార్త్ ఓట్ పల్స్ కు చాలా తేడా ఉంటుంది. సౌత్ లో ఇండివీజువల్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీ గా నేను కొట్లాడుతా. సర్వే లో ఓసి, బీసీ కి ఈక్వల్ వస్తే..బీసీ కే టిక్కెట్ ఇస్తాం. తమ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీ లు అడగడం లో తప్పులేదు. మేము కూడా బీఆర్ఎస్ బీసీ లకు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ ఇస్తాం.
Comments
Please login to add a commentAdd a comment