కాకినాడ రూరల్: రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద వైరస్ చంద్రబాబునాయుడేనని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్‌ను కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదని చెప్పారు. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోండని జిల్లాలకే అవకాశం ఇచ్చారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారని, ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. ‘యజ్ఞం చేసేటప్పుడు భగ్నం చేసే రాక్షసుడు పక్కనే ఉంటాడని పురాణాల్లో విన్నాం. సరిగ్గా ఇలాగే కరోనాను కట్టడి చేసి, ప్రజల ప్రాణాలను కాపాడే యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే.. చంద్రబాబు విష ప్రచారం చేస్తూ, లేనిపోని వదంతులను సృష్టిస్తున్నారు. జాతీయ విపత్తు వచ్చినప్పుడు యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహాయ పడాల్సింది పోయి పార్టీ నాయకులతో ధర్నాలు చేయిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
బాబు మాటలను ఎవరూ నమ్మొద్దు
► కర్నూలులో ఎన్–440కే అనే వైరస్ వచ్చి, మిగిలిన చోట్లకూ విస్తరిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల ఇతర రాష్ట్రాలు మనవైపు అనుమానంగా చూస్తున్నాయి. ఒకపక్క సీసీఎంబీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు ఆ వైరస్ వచ్చిందనడం అబద్ధమని చెప్పినా కూడా చంద్రబాబు ప్రజలను టెర్రరిస్టులా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మొద్దు. దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు మాత్రమే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులు. ఈ లెక్కన ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున నెలకు 3.5 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించగలుగుతారు. దీని ప్రకారం దేశంలోని 130 కోట్ల జనాభాకు వ్యాక్సినేషన్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదా?
► వ్యాక్సిన్‌ను కేంద్రమే రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఈ రెండు సంస్థలూ జూలై, ఆగస్టు నాటికి సామర్థ్యం పెంచుకుంటామంటున్నాయి. నెలకు గరిష్టంగా 16 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తే, ఈలోగా రష్యా నుంచి స్పుత్నిక్ టీకా వస్తే దేశం, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు కొన్ని నెలలు పడుతుంది.
► రాష్ట్రంలో మొత్తం అందరికీ ఉచితంగా టీకాలు వేయించేందుకయ్యే రూ.1,600 కోట్లు భరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర జనాభా 5.30 కోట్ల మందిలో 3.48 కోట్ల మంది వ్యాక్సిన్‌కు అర్హులు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ వచ్చిన డోసులు 73.49 లక్షలు. అవసరమైన డోసులు 6.96 కోట్లు.
ఆ కమీషన్ మీరే తీసుకుని టీకా ఇప్పించండి
► వాస్తవాలు ఇలా ఉండగా టీకాలు వేయడం లేదంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీకు అత్యంత సన్నిహితుడైన రామోజీరావు గారి కుమారుడి వియ్యంకుడి కంపెనీ భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్లను మీ పరపతిని ఉపయోగించి ఇప్పించాలి. అలా చేస్తే రూ.1,600 కోట్లు మీరు చెప్పిన అకౌంట్‌కు ఇస్తాం. ఇండెంట్ ఎవరికి పంపించాలో చెప్పండి.
► ఈ రోజు ఓ పచ్చపత్రికలో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే టీకాలు కొనడం లేదంటూ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ కమీషన్లు మీరే తీసుకోండి. ఇండెంట్ భారత్ బయోటెక్‌కు పంపించమంటారా? ఈనాడుకా లేక అచ్చెన్నాయుడుకా?
► రాష్ట్రంలో టీకా అవసరాలపై భారత్ బయోటెక్‌తో సీఎం వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడారు. అధికారులు రవిచంద్ర, తదితరులు లేఖలు రాశారు. 3,43,930 డోసులు ఇవ్వాలని భారత్ బయోటెక్‌కు కేంద్రం చెప్పింది. అందులో 1,25,000 డోసులు సరఫరా చేస్తామని తెలియజేసింది. అలాగే కోవిషీల్డ్ 9,91,700 డోసులు అందిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. మొదటి డోసు వేసుకున్నవారికి రెండోది వేయకపోతే పని చేయదని వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం.
► ఆక్సిజన్‌ను ఒడిశాలోని అంగురు నుంచి విమానాల ద్వారా తీసుకు వస్తున్నాం. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత లేకుండా చూస్తున్నాం. వైఎస్సార్ టెలి మెడిసిన్ పని చేస్తోంది. ఇన్ని విధాల పని చేస్తున్న ప్రభుత్వంపై విష ప్రచారం సరికాదు. మీడియా కూడా సంయమనం పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment