
కాకినాడ రూరల్: రైతుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయంగా నాలుగు విడతలుగా ఏడాదికి రూ.12,500 చొప్పున రూ.50 వేలు ఇస్తామని చెప్పి అంతకంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్ళ పాటు రూ.67,500 అందిస్తోందన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా ఇవ్వదని చెప్పారు. కౌలు రైతులకు, గిరిజన రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులు, దేవదాయ సాగుదారులకు కేంద్రం పీఎం కిసాన్ పథకం వర్తింపజేయదని చెప్పారు. కానీ సీఎం జగన్ రైతు పక్షపాతిగా అందరికీ సాయం అందిస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు రూ.20,117.58 కోట్లు రైతుల అకౌంట్‌లో వేశారని, దాదాపు 52.38 లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేస్తున్న పవన్.. పీఎం కిసాన్‌లో కౌలు రైతులకూ సాయం చేయాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు రైతులతో రాజకీయం చేస్తారని, జనసేన కూడా అదే బాటలో వెళ్తోందని కన్నబాబు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment