పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్‌లు చేసుకోండి.. సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో వద్దు
కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు
సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి
పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్లులా కనిపిస్తున్నారా?
స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలిగానీ, స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడమేమిటి?
కాపు సంఘ సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్‌కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు.
జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్‌ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు..
2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్‌కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్‌లు పెట్టడం మగతనం అనిపించుకోదు.
21 సీట్లకు పరిమితం కావడం దారుణం..
తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్‌లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది.
మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ?
అసలు పేదల కోసం జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది.
వైఎస్సార్‌సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్‌కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment