లఖీమ్‌పూర్‌ఖేరిలో రైతుల మృతదేహాలతో అన్నదాతల నిరసన
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఖేరిలో ఆదివారం నుంచి నిరసనలు చేస్తున్న రైతు సంఘాలకు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదుగా రెండు ఎస్‌యూవీలు దూసుకుపోవడం, ప్రతిగా రైతులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగిన ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనల్లో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.45 లక్షల చొప్పున భారీ నష్ట పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. గాయపడిన రైతులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీశ్ అవస్తి వెల్లడించారు. దీంతో రైతులు కూడా వెనక్కి తగ్గారు. నిరసన విరమించి మరణించిన రైతన్నలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇక ఈ హింసాకాండపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయూ) నేత రాకేశ్ తికాయత్ సమక్షంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. లఖీమ్‌పూర్‌ఖేరి హింసతో సంబంధమున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాసింది.
మంత్రి కుమారుడిపై హత్య కేసు
లఖీమ్‌పూర్ హింసాకాండపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కాన్వాయ్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసాకాండలో బీజేపీ కార్యకర్తలు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ ఒక వాహనాన్ని నడుపుతున్నాడని రైతులు ఆరోపిస్తూండటంతో... అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిరసనలు చేపట్టాయి.
రెండు నిమిషాలు చాలు కేంద్ర మంత్రి పాత వీడియో హల్‌చల్
మంత్రి అజయ్ కుమార్‌దిగా భావిస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన రైతులపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ‘మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి నాకు రెండు నిమిషాలు చాలు’ అని ఆయన అంటున్నట్టుగా వీడియోలో ఉంది. ‘‘నాతో తలపడండి. కేవలం 2 నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా. నేను మంత్రినో, ఎంపీనో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు. అంతకు ముందు నుంచి ప్రజలకు నేనెవరో తెలుసు. సవాళ్ల నుంచి నేను పారిపోను’’అని చెబుతున్నట్టుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment