
Manipur Assembly Elections Meet Brinda Thounaojam: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ.. మిగిలిన ఫేజ్‌ల కోసం ఉధృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. ముఖ్యంగా మణిపూర్‌లో ఈసారైనా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ తరుణంలో గత కొన్నిరోజులుగా పార్టీ కీలక నేతలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే ఒకేఒక్క అభ్యర్థి కోసం అమిత్ షా రంగంలోకి దిగడం.. చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.
Manipur Elections 2022 లో.. ఇంపాల్ ఈస్ట్ యాయిస్కల్ నియోజకవర్గంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రచారం చేశారు. కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి బీజేపీని ఆదరించాలంటూ అభ్యర్థించారు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే అయినప్పటికీ.. అవతల ఉంది అంతే బలమైన అభ్యర్థి అని ఆయన నమ్ముతున్నారు. జేడీయూ తరపున బృందా తోవునావోజామ్(43) ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో మణిపూర్ పోలీస్ శాఖలో పని చేశారామె. నిజాయితీ ఉన్న ఆఫీసర్‌గా.. డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపిన ఆమెను ‘సూపర్ కాప్’గా అభివర్ణిస్తుంటుంది ఆ రాష్ట్రం. అందుకే బీజేపీ ఆమె అభ్యర్థిత్వాన్ని సవాల్‌గా తీసుకుంది. బీజేపీలో బలమైన నేత, మణిపూర్ న్యాయశాఖ మంత్రి తోక్చోమ్ సత్యవ్రత సింగ్ మీద పోటీ చేస్తున్నారామె.
ఒక్క కేసుతో సెన్సేషన్..
బృందా మామ ఆర్కే మేఘెన్.. మణిపూర్‌కి వ్యతిరేకంగా సాయుధ దళ విభాగాన్ని నడిపించిన వ్యక్తి. కానీ, ఆమె మాత్రం పోలీస్ శాఖలో చేరి.. నిజాయితీ ఉన్న ఆఫీసర్‌గా పేరు సంపాదించుకుంది. అందుకే అక్కడి యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2018లో సుమారు 27 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న హై ప్రొఫైల్ కేసు ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆమె కృషికి బీరెన్ సింగ్ ప్రభుత్వం ఆమెకు సత్కారం కూడా చేసింది. అయితే..
రాజీనామాలు
అయితే ఈ కేసుకు సంబంధించి ఆమెకు.. సీఎం బిరెన్ సింగ్‌తో బేధాభిప్రాయాలు తలెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు.. నిర్దోషిగా బయటకు రావడానికి ముఖ్యమంత్రే సాయం చేశారంటూ ఆరోపణలు చేస్తూ.. తనకు ఇచ్చిన అవార్డును వెనక్కి ఇచ్చారామె. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఆమె ఇలా సంచలనాలతో వార్తల్లో నిలవడం ఇదేం కొత్త కాదు. నిషేధిత గ్రూపుకు నేత అయిన ఆర్కే మేఘెన్ కోడలనే కారణంతో పోలీస్ శాఖ తనపై వివక్ష చూపిస్తున్నారంటూ 2016లోనూ బృందా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమెపై ప్రజల్లో సింపథీ ఏర్పడింది.
తనకు వ్యతిరేకంగా బీజేపీ కీలక నేత అమిత్‌షా ప్రచారం నిర్వహిస్తుండడంపై బృందా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిని తానొక కాంప్లిమెంట్‌గా భావిస్తానని, పోలీసుగా ప్రజలకు ఏం చేయలేకపోయిన తనకు.. పొలిటీషియన్‌గా ఏదైనా చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారామె. అవినీతి, డ్రగ్స్ అరికట్టడం అనే అంశాల మీదే ప్రధానంగా ఆమె ప్రచారం కొనసాగుతోంది ఇప్పుడు. ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 28, మార్చి 5వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి.
Comments
Please login to add a commentAdd a comment