తండ్రి అండ.. అన్న ఆశయం నీడ | Mekapati Vikram Reddy Is Looming In The Election Campaign | Sakshi
Sakshi News home page

తండ్రి అండ.. అన్న ఆశయం నీడ

Published Sun, Jun 5 2022 11:25 AM | Last Updated on Sun, Jun 5 2022 11:49 AM

Mekapati Vikram Reddy Is Looming In The Election Campaign - Sakshi

తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇచ్చిన ఆత్మకూరు ప్రజల అండదండలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నామని చెప్పుకోవడం మినహా, ప్రధాన పార్టీలకు స్థానిక అభ్యర్థులు కరువయ్యారు. ఆత్మకూరులో బీజేపీ స్థానికేతరుడైన భరత్‌కుమార్‌ యాదవ్‌ను బరిలోకి దింపాల్సి వచ్చింది. మరో వైపు విక్రమ్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని చూరగొన్న దివంగత గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని పోలింగ్‌ తేదీ కోసం తహతహలాడుతున్నారు.   

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అతి తక్కువ సమయంలో ప్రజల అభిమాన పాత్రుడు అయ్యాడు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి పట్ల చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి విక్రమ్‌రెడ్డి సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. తన అన్నపై పెంచుకున్న అభిమానం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గౌతమ్‌రెడ్డి ఆశయాలు నెరవేరుస్తానని ఘంటాపథంగా చెబు తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీ–ఫారం ఇచ్చిన తర్వాత ఈ నెల 2న నామినేషన్‌ దాఖలు చేశారు. 

శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు రోజుల్లో 18 పంచాయతీల ప్రజల దరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి చేరారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ స్థానికులతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూనే ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాన్ని బలపర్చాలని, సోదరుడు గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం అంతా ఏకమై తీర్పు చెప్పాలని కోరుతున్నారు. గ్రామాల్లో అనూహ్య మద్దతు లభిస్తోండడంతో మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక రెఫరెండమ్‌ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీకి స్థానికేతరుడే దిక్కు  
భారతీయ జనతా పార్టీకి ఆత్మకూరులో అభ్యర్థి కరువయ్యారు. నోటిఫికేషన్‌ ప్రకటించక మునుపే ముందే పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఒకప్పుడు ఆత్మకూరులో బీజేపీ గణనీయమైన మద్దతు లభించింది. 1985, 89ల్లో స్వల్ప ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓటమి పాలైంది. అటువంటి నియోజకవర్గంలో ఈ దఫా డిపాజిట్లు కాదు కదా.. కనీస ఓట్లు కూడా పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూకుమ్మడిగా దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని ప్రజలు పార్టీలకతీతంగా భావిస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక నాయకులు పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి బాహాటంగా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికేతరులే దిక్కయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ను బరిలోకి దింపారు.   

అపార మద్దతు లభిస్తోంది
– మేకపాటి విక్రమ్‌రెడ్డి 

ప్రభుత్వం నుంచి రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సోదరుడు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు ప్రజల్లో ఒక్కరుగా మమేకమయ్యారు. ఆత్మకూరును అన్నీ విధాలు అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. ఆయన మృతితో రాజకీయాలకు వర్గాలకతీతంగా ప్రజల నుంచి అపార మద్దతు లభిస్తోంది. అనంతసాగరం మండలం మినగల్లు పంచాయతీలో ప్రచారం అనంతరం వెంకటరెడ్డిపల్లె స్థానిక నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించాను. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ ప్రజాజీవితానికి అంకితం కానున్నట్లు ప్రకటించారు. సోదరుడి ఆశయసాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైనికుడిగా పని చేయనున్నట్లు వివరించారు. తన తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవాలను అనుసరించి ప్రజల కోసమే పని చేస్తాను. స్థానిక సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తాను. 

విక్రమ్‌ అన్నలో గౌతమన్నను చూసుకుంటున్నాం  
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం జీర్ణించుకోలేనిది. ఆయన సోదరుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిలో గౌతమ్‌ అన్నను చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో గౌతమన్న ఆశయాల సాధన కోసం విక్రమ్‌రెడ్డి ద్వారా సాధించుకోవాలని ప్రజలు ఆకాంక్షతో పోలింగ్‌ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.    
– పెయ్యల సంపూర్ణమ్మ, అనంతసాగరం ఎంపీపీ  

భారీ మెజార్టీయే గౌతమన్నకు ఘన నివాళి  
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే ఘనమైన నివాళి. గౌతమన్న ప్రత్యేక పంథాతో వివాద రహితుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని దీవించి భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే గౌతమన్న ఆత్మ సంతోషిస్తుంది.       
– రాపూరు వెంకటసుబ్బారెడ్డి, అనంతసాగరం జెడ్పీటీసీ సభ్యుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement