
గుంటూరు రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని.. అందుకే మహిళల రక్షణ కోసం పటిష్టమైన దిశ చట్టాన్ని రూపొందించారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు టీడీపీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు మహిళా చట్టాలను సైతం అవహేళన చేయటం, పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసనలు తెలపటం బాధాకరమన్నారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ నాయకులకు మహిళలపై ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది నిమిషాల వ్యవధిలో ఏవిధంగా రక్షణ పొందుతున్నారో రోజూ పత్రికల్లో, వార్తల్లో చూస్తూనే ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే తహసీల్దార్‌పై దాడి చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాంటి దాడులు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. మహిళలకు ఏదైనా ఘటన జరిగితే వెంటనే కేసు నమోదు చేసి ఏడు రోజుల్లో చార్జ్‌షీట్ వేస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు 1,500 కేసుల్లో 7 రోజుల్లో చార్జ్‌షీట్‌లు వేసినట్టు తెలిపారు. కేవలం తమ మనుగడ కోసం కాకుండా మహిళల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలు సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేగానీ ఉనికిని కాపాడుకునేందుకు మహిళలను, మహిళా చట్టాలను కించపర్చవద్దని హితవు పలికారు.