నాపై ఆ మహిళ నిరాధార ఆరోపణలు. ఫిర్యాదు
ఆ మహిళతో నాకెలాంటి సంబంధం లేదు
ఆమె దగ్గర నేను ఏ డబ్బు తీసుకోలేదు
లోబర్చుకునే ప్రయత్నమూ చేయలేదు
నేనే జిల్లా ఎస్పీని కలిసి విచారణ కోరుతాను
కుట్ర వెనక ఎవరున్నా వదిలి పెట్టబోను
మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టీకరణ
సాక్షి, గుంటూరు: తనపై ఆరోపణలు చేసి, ఫిర్యాదు చేసిన మహిళతో తనకెలాంటి సంబంధం లేదని, ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి టెస్ట్‌లకైనా సిద్ధమని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రకటించారు. తాను ఆమె దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించానని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో చాలా కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎదిగానన్న మాజీ మంత్రి, నాడు వైఎస్సార్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత క్రమంగా మంత్రిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. ‘నిరంతరం నేను ప్రజల మధ్య ఉంటాను. నన్ను కలిసేందుకు, నా సహాయం కోసం అనేక మంది వస్తుంటారు. ఎవరికైనా సరే సహాయం చేయాలని అనుకుంటాను. నాపై ఈ ఆరోపణలు, ఫిర్యాదు అంతా కూడా కుట్ర ప్రకారం జరిగింది. చాలా బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు’ అని తెలిపారు.
తనపై చేసిన ఫిర్యాదుపై తానే స్వయంగా జిల్లా ఎస్పీని కలిసి పూర్తిస్ధాయి విచారణ కోరుతానని మాజీ మంత్రి తెలిపారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయట పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానన్న ఆయన, కుట్ర వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment