Minister Jogi Ramesh Challenged To TDP Chandrababu On AP Development, Details Inside - Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..?

Published Sat, Apr 8 2023 11:13 AM | Last Updated on Sat, Apr 8 2023 12:45 PM

Minister Jogi Ramesh Challenged To TDP Chandrababu On Development - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారో చర్చిద్దామా? అని ప్రశ్నించారు. 1.50 కోట్ల ఇళ్ల దగ్గరకు రావడానికి చంద్రబాబు సిద్దమా? అని మంత్రి సవాల్‌ చేశారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః

బాబు పిల్ల చేష్టలుః
నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల మీద చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్స్ చూస్తే.. పిల్ల చేష్టల్లా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిది. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి.  74 ఏళ్ళ వయసు, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగటం- దాన్ని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది.  మీ హయంలో పునాది దశకే పరిమితమైన టిడ్కో ఇళ్లను మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి, మౌలిక సదుపాయలు కల్పిస్తే.. దాన్ని నీవేదో ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఎక్కడ లేదు అని అడుగుతున్నాం. 

టిడ్కో ఇళ్ళు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పు భారం వేస్తే.. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆ భారాన్ని మొత్తం తగ్గించి పేదవాళ్ల కు వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు.

బాబుకు ఛాలెంజ్ః
చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చేసిన ట్వీట్ కు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 50 లక్షల గడపల దగ్గరకు రావడానికి, ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో చర్చించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.  అలానే, మా హయాంలో నిర్మిస్తున్న 17, 005 జగనన్న కాలనీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ కాలనీలలో లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఏ విధంగా కాలనీల్లో ప్రజలు నివాసం ఉంటున్నారో తెలుసుకోవడానికి మాతో పాటు చంద్రబాబు వచ్చినా సరే, లేకుంటే ఆయనతో పాటు మేము అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నా. స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?. మీ అబ్బాయి నారా లోకేష్కు పనిపాట లేక రోడ్ల వెంట తిరుగుతున్నాడు. బస్సు ఎక్కి ఫోటో, ఆటో దగ్గర ఫోటో దిగి పెడుతున్నాడు. మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గులేదా? అని అడుగుతున్నాం. 

సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకు రేపో, మాపో మూర్ఛ రోగం వస్తోంది. చంద్రబాబు తన పాలనలో చెప్పుకోవడానికి అయినా ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టి అమలు చేశాడా? అభివృద్ధి కార్యక్రమం చేశాడా? తన అయిదేళ్ల పాలనలోకాలక్షేపం, కబుర్లు చెప్పబట్టే చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిర్మాణంలో ఉన్న 17 వేల జగనన్న కాలనీలు మాతో పాటు వచ్చి చంద్రబాబు  చూస్తే గుండె ఆగి చస్తాడు. ఇవాళ 17వేల జగనన్న లే అవుట్లు...ద్వారా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నాం. కొన్నిచోట్ల పదివేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక మున్సిపాల్టీయే ఏర్పడుతుంది. ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యక్షంగా చూసేందుకు రమ్మని మరోసారి చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నాం.

14 ఏళ్ళ సీఎంగా నీవు చేసిందేమోటో చెప్పగలవా బాబూ?
14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన మేలు ఏమిటి..? ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి?  నాలుగేళ్లల్లోనే జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటో మేం జగన్ మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి చెబుతున్నాం. నీవు ఏమైనా మంచి చేసి ఉంటే.. ప్రజల గడపల వద్దకు వెళ్ళి చెప్పే ధైర్యం ఉందా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు సమాధానం చెప్పాలి

చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసి ఉంటే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అయింది...?. గడిచిన మూడేళ్ల పది నెలల కాలంలో ప్రతి గడపకు మేము మంచి చేశాం కాబట్టే.. ఆ గడపకు వెళ్లి అక్కా చెల్లి, అవ్వాతాత, అన్నాతమ్ముడి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. 

భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఏ రాజకీయ నాయకుడు అయినా  ప్రతి గడపకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇవాళ మా ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచి చేసింది కాబట్టే, వారి ఆశీస్సుల కోసం మేమంతా ఆ గడప దగ్గరకు నేరుగా వెళుతున్నాం.

ప్రతి గడపకు వెళ్లడమే కాకుండా ప్రభుత్వ పథకాలు సంతృప్తిగా ఉన్నాయా? వారికి రావాల్సిన లబ్ధి గురించి అడుగుతున్నాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, డీబీటీ ద్వారా నేరుగా తమ ఖాతాల్లోకి నగదు జమ కావడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఇప్పుడు అలా జరుగుతుంది కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు.

ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాము ముఖ్యమంత్రిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా, తమ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా, మేనమామగా చూస్తున్నామని, ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఏ నాయకుడికైనా ఇంతకన్నా కావల్సిందేముంది. అదే చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ఒక కంసుడుగా, ఒక నరకాసురుడుగా ప్రజలు భావిస్తున్నారు. 

అమ్మ ఒడిలాంటి పథకం పెట్టాలని బాబు బుర్రకు ఏనాడైనా తట్టిందా..?
మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఓర్వలేని చంద్రబాబు నాయుడు సెల్ఫీలు అంటూ మాకు ఛాలెంజ్ లు విసరడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చీమూ, నెత్తురు ఉంటే మా ఛాలెంజ్ ను స్వీకరించాలి. గత నాలుగేళ్ళుగా  మేము చేసిన మేలుతో పాటు, చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలకు చేస్తామని ఎగ్గొట్టిన రుణమాఫీపైనా, రైతులు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని మోసం చేసిన విషయంలో చర్చకు సిద్ధమా?. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బుర్రలో..  పిల్లల చదువుకోసం తల్లులు ఖాతాల్లో నగదు వేసే ఆలోచన ఎన్నడైనా తట్టిందా? ఇవాళ జగన్ మోహన్ రెడ్డిగారు తన మానస పుత్రికగా,  అమ్మ ఒడి పథకం ద్వారా ఆ కార్యక్రమం చేపట్టారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం ఇస్తున్నాం. అలాగే ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి మరీ అవ్వా తాతల చేతుల్లో పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం. మీ పాలనలో ఇటువంటివి ఏమైనా చేశారా చంద్రబాబూ..? అని అడుగుతున్నాం.

నారా లోకేష్ కు మాతో పోటీపడే దమ్ము, ధైర్యం లేదు. కేవలం సెల్ఫీలు తీసి, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టి హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకుగా పాదయాత్ర చేస్తున్నావో, లేక మాజీమంత్రిగా పాదయాత్ర చేస్తున్నావో మాకు తెలియదు కానీ... జగనన్న కాలనీల పురోగతి, పనితీరు మీద చర్చకు ఎక్కడకు రమ్మన్నా నేను వచ్చేందుకు సిద్ధం. ఒకవేళ మాతో నారా లోకేష్ వచ్చినా తీసుకువెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. 

చంద్రబాబు అయినా నారా లోకేష్ అయినా గుడ్డ కాల్చి మొహాన వేసి తుడుచుకుని వెళ్లిపోయే రకాలు. మీ ట్వీట్లకు స్పందించాం. మా ఛాలెంజ్ కు మీరు సిద్ధమా? మీకు స్పందించే గుణం ఉంటే.. తండ్రికొడుకులు వచ్చేందుకు సిద్ధమా? మీ పాదయాత్రలో ఎక్కడైనా పాల్గొనేందుకు నేను సిద్ధం. ప్రతి గడప దగ్గరకు వెళ్లి ప్రతి అక్కచెల్లెమ్మను అడుగుదాం. మీ హయాంలో చేసిన అభివృద్ధి, మేలు- మా నాలుగేళ్ల పాలనలో జరుగుతున్న మేలుపై వారినే నేరుగా అడుగుదాం.

మా నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగారు నేరుగా బటన్ నొక్కగానే  డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు కామన్ మెన్ ఖాతాలోకి జమ అయ్యాయంటే అది పరిపాలన.

మీకులా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మాకు చేతకాదు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించడమే మా జగనన్న విధానం. దమ్ముంటే మా ఛాలెంజ్ ను స్వీకరించాలని చంద్రబాబుకు ఆయన కొడుకు లోకేష్ కు ఛాలెంజ్ చేస్తున్నాం.

175 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ బాబుకు ఉందా..?
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...-2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది.  వై నాట్ 175,  వై నాట్ కుప్పం.. ఇవే మా టార్గెట్ లు. 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తామంటున్న చంద్రబాబు నాయుడుకు అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ ఉందా? అదే ఉంటే పొత్తుల కోసం పొర్లాడటం ఎందుకు?

దమ్ము, ధైర్యం లేని చవటలు, సన్నాసులు జగన్ గారితో పోటీనా? ఒక వీరుడిని ఎదుర్కొనేందుకు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా.. సింహం ముందు దిగదుడుపే.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ గుర్తుతో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement