సాక్షి. కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందివాడలో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది ఉంటారని, వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసని అన్నారు. మైకు పట్టుకొని ఊగిపోతూ తోడలు మెడలు నలపుకుంటూ ఎదో వాగితే వినేందుకు జనం పిచ్చివాళ్ళు కాదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు అపద వస్తే కాపాడటానికి మాత్రమే రోడ్డు మీదకు వచ్చి నోటికి వచ్చినట్లు వాగుతావని ఎద్దేవా చేశారు. మేము ఎమైనా అంటే బూతులు తిడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఒక్కమాట అన్న కూడా మేము పదిమాటలు అంటామని ధీటుగా సమాధానమిచ్చారు. నువ్వు నన్ను బూతులు మంత్రి అంటావో ఇంకా ఎమైనా అంటావో డోంట్ కేర్. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, దేనికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. చదవండి: ‘మంత్రులకు పవన్ క్షమాపణ చెప్పాలి’
‘మాకు వార్నింగ్ ఇచ్చే స్థాయి నీకు లేదు. నువ్వు, నీ పార్ట్‌నర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చినా ఏం చేయలేదు. ప్యాకేజీ తీసుకుని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. చంద్రబాబు ఉస్కో అనగానే.. పవన్ డిస్కో అంటూ వస్తాడు. నువ్వు కొట్టగానే పదిమంది ఎగిరిపడటానికి ఇది సినిమా కాదు. నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. నష్టపోయిన రైతులకు ముప్పై అయిదువేలు ఇవ్వాలంటున్నావు. 80లక్షల మంది రైతులకు ఎంత ఇవ్వాలో తెలుసా. చంద్రబాబు నాయుడు ఏదో రాసిస్తే అది పట్టుకొచ్చి పిచ్చోడిలా వాగుతావు. జనం నవ్వు కుంటున్నారు. రైతులకు అప్పులు మాఫీ చేస్తానన్న చంద్రబాబుతో తిరిగావు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మోసం చేస్తే చొక్కా ఎందుకు పట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే రైతులు నష్టపోయారు తప్ప మా వల్ల కాదు. నష్టపోయిన రైతులకు నెలరోజుల్లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం. పూర్తిగా తడిసి, రంగుమారి తినటానికి పనికిరాని ధాన్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ ద్వారా రైతుల దగ్గర కొంటున్నాం. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం: అర్హులందరికీ సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదలకు స్థలాలతో పాటు ఇళ్ళు కట్టిస్తామని భరోసానిచ్చారు. ఇళ్ల స్థలాల కోసమే రూ. పదివేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇళ్ళను కూడా ప్రభుత్వమే కట్టిస్తుందన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని విమర్శించారు. లోకేష్ ఒక పప్పు బాయి అని, లోకేష్‌కు రైతుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రైతులకు అన్ని రకాలుగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది అని ప్రశంసించారు. గతంలో నా డబ్బులు అయిదు కోట్లు దొరికాయని టీడీపీ ఆరోపించిందని, లీగల్ నోటీసులు ఇస్తే సమాధానం కూడా లేదని అన్నారు. జూమ్‌లో ఉన్న బాబు పొద్దు పోక మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దక్షిణ నియోజక వర్గం పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అధికంగా పాల్గొనగా.. మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, కమిషనర్ డాక్టర్ సృజన హాజరయ్యారు. కాగా దేశ చరిత్రలోనే ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ సువర్ణ అధ్యాయమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పేదల పట్టాల పంపిణీ చూసి టీడీపీ నాయకులు ఓర్వ లేక పోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment