
ఫైల్ ఫోటో
నక్కపల్లి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక అడ్డుతొలగించుకునేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు కుట్రపన్నుతున్నారని రాష్ట మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు శుక్రవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్‌లో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యాన వేలాదిమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ జగన్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబు మహానాడులో వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో జగన్‌ను ఉద్దేశించి గాల్లో వచ్చినవాడు గాల్లోనే పోతాడని అబ్బాకొడుకులు (చంద్రబాబు, లోకేశ్) వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తహతహలాడుతున్నారని చెప్పారు. రోజురోజుకు జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు.. జగన్‌ను అడ్డుతొలగించుకోవాలనే కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో చంద్రబాబు పలుమార్లు చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ అభిమానులను కలవరపెడుతున్నాయని చెప్పారు. జగన్‌ను రాష్ట్రంలోనే లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోందన్నారు. జగన్‌ను కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఐకమత్యంగా ఉండి పార్టీకి, అధినేతకు అండగా నిలవాలని కోరారు. జగనన్న ప్రజలకు ఉచితంగా డబ్బు దోచిపెడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే తట్టుకోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీచేసినా మళ్లీ అధికారం వైఎస్సార్‌సీపీదేనని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.