
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా పొలిటికల్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పవన్ కార్లపై కూర్చుని హంగామా చేశారని వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటంలో పవన్ రౌడీలా ఊగిపోయాడు. కార్లపై కూర్చుని హంగామా చేశారు. ఇప్పటం విషయంలో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. చివరకు 14 మందకి కోర్టు జరిమానా విధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏది చేసినా ప్రజల కోసమేనని మరసారి రుజువైంది. రుషికొండలో టూరిజం అభివృద్ధి పనులే జరుగుతున్నాయి. కోర్టు డైరెక్షన్‌లోనే రుషికొండపై ముందుకెళ్తున్నాము. అమరావతి పాదయాత్రలో పాల్గొన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులే.
మంగళగిరిలో గెలవలేని లోకేష్.. సీఎం జగన్‌కు సవాల్ విసురుతున్నాడు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే గెలవలేని లోకేష్.. సవాల్ విసరడం విడ్డూరంగా ఉంది. లోకేష్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. పవన్ కల్యాన్ ఇప్పటం, విశాఖపట్నం రావడం వల్ల మాకు మంచే జరిగింది. గత ఎన్నికల్లో పవన్‌ను ప్రజలు రెండు చోట్లా ఓడించారు. కానీ, భవిష్యత్తులో పవన్ పార్టీని కనిపించకుండా తరిమికొడతారు’ అని అన్నారు.