సాక్షి, తాడేపల్లి: అబద్దాలను సృష్టించి.. ఎల్లోమీడియాలో ప్రచారం చేయటమే టీడీపీ, జనసేన పని అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భయం సృష్టించాలనేది వారి ప్లాన్.. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశారు. మ్యాక్స్ చట్టం తెచ్చి తన మనుషులకు డెయిరీలను కట్టబెట్టారు. సంగం, విశాఖ, కృష్ణా డెయిరీలను తన వారి చేతిలో పెట్టారు. చిత్తూరు డెయిరీని ఎలా నాశనం చేశారో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వెళ్లింది?. 73 ఎకరాల భూములు సంగం డెయిరీకి ఉండేవి. ఆ భూములపై రూ.150 కోట్ల వరకు అప్పు తెచ్చుకున్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర కబ్జా చేసిన భూములు, డెయిరీలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టటంలో టీడీపీ వారికి ఉన్నంత స్కిల్ మరెవరికీ లేవు. ప్రభుత్వ ఆస్తులను దోచుకునే టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేయటం ఏంటి? అంటూ మంత్రి ప్రశ్నించారు.
అమూల్ పేరు వింటేనే టీడీపీ నేతలకు నిద్ర పట్టటం లేదు. అమూల్ వలన పాడి రైతులకు మంచి లబ్ది చేకూరింది. అమూల్ రాకముందు సంగం డెయిరీ వారు 58 రూపాయలు రైతులకు ఇచ్చేవారు. అమూల్ వచ్చాక రూ.69.35లు ఇస్తున్నారు. అమూల్ రాక ముందు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వారు పాల ధర పెంచేవారు. అమూల్ వచ్చాక బలవంతంగా ధరలు పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. గత మూడేళ్లలో 8 సార్లు ధరలు పెంచారు. ఇదీ జగనన్న పాలవెల్లువ ఎఫెక్ట్. ఇది తట్టుకోలేకనే అమూల్‌పై ఎల్లోమీడియాలో విషం కక్కుతున్నారు’’ అని మంత్రి నిప్పులు చెరిగారు.
3.73 లక్షల మంది రైతులు అమూల్‌కి పాలు పోస్తున్నారు. అమూల్ వల్ల 4,490 కోట్ల అదనపు లబ్ధి రైతులకు చేకూరింది. అంటే అమూల్ వలన పాడి రైతులకు మేలు చేకూరటం కాదా?. జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణలోని ఒక పార్టీ నుండి, ఏపీలో మరొక పార్టీ నుండి స్క్రిప్టు వస్తుంది. నాదెండ్ల మనోహర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. చంద్రబాబు పాలనలో ఆదరణ పథకం కింద ఏ ఒక్క కుటుంబమైనా బాగుపడిందా?. మేము ఒక పాడిగేదెని కొనివ్వటం వలన ఆ కుటుంబం బాగుపడింది. చేయూత పథకం ద్వారా మా ప్రభుత్వం ఎంతోమందికి మేలు చేకూర్చింది. నాదెండ్ల మనోహర్ సొంత బుర్ర ఉపయోగించి విషయాలు తెలిసుకుని మాట్లాడితే మంచిది’’ అని మంత్రి హితవు పలికారు.
‘‘టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయి. గత ఎన్నికలలో కూడా ఒప్పందం మేరకే వేర్వేరుగా పోటీలో ఉన్నారు. అమరావతి ఎవరి రాజధాని? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే అమరావతి పై ఎందుకు ప్రేమ చూపుతున్నారు. పార్టీని పవన్ అమ్మేశాడని జన సైనికులు గుర్తించాలి. ఏపీలో మద్యం బ్రాండ్లను పురందేశ్వరి టేస్టు చేస్తున్నారేమో తెలీదు. ఇప్పుడు ఉన్నవన్నీ చంద్రబాబు పర్మిషన్‌తో వచ్చినవే. కాబట్టి పురందేశ్వరి వెళ్లి చంద్రబాబునే ప్రశ్నించాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది. బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక ఆమె పరువు దిగజారింది. బీజేపీలో ఉన్న క్యాడరే పురందేశ్వరితో విభేదిస్తున్నారు. పురంధేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిది. ఏపీలో మద్యం అక్రమాలు ఉన్నట్టుగా అనిపిస్తే సీబీఐతో విచారణ చేయించుకోవాలి. పురంధేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు. చంద్రబాబు అన్ని ప్రభుత్వ సంస్థల నుండి తన ఖాతాలోకి డబ్బులు మళ్లించారు’’ అంటూ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.
చదవండి: Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే..
Comments
Please login to add a commentAdd a comment