తాడేపల్లి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ కుట్రలు దాగున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఆలయాలపై దాడులు టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న విగ్రహ రాజకీయాల వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ..
సంతబొమ్మాళి మండలంలో నంది విగ్రహాన్ని తొలగిస్తూ టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డంగా బుక్కైనా.. ఆయా పార్టీల నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని, ఇందులో పాత్రదారులు టీడీపీ, బీజేపీలకు చెందిన కార్యకర్తలేనని ఆధారాలతో సహా బహిర్గతమైందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో చంద్రబాబు తీరు.. జల్లెడ వెళ్లి సూదిని వెక్కిరించినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ కుట్ర జరిగిందన్నది బహిరంగ రహస్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఎల్లో విలేఖరితో పాటు అచ్చెన్నాయుడు మనుషులు కూడా ఉన్నారని మంత్రి ఆరోపించారు. నిన్న చంద్రబాబు తిరుపతి పార్లమెంటరీ బూత్ కమిటీ జూమ్ మీటింగ్‌లో చేసిన అనేక విమర్శలకు మంత్రి కౌంటరిచ్చారు.
కాగా, ఆలయాల దాడులపై ఇప్పటికే 22 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని మంత్రి స్పష్టం చేశారు. రేపటి నుంచి ఇంటివద్దకే నిత్యవసరాల పంపిణీ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుందని వెల్లడించారు. దీన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీ పర్యటనపై అవగాహన లేని లోకేష్ బాబు ఏదేదో ట్వీట్లు పెడుతున్నారని, ఆయన హెరిటేజ్ పాలు కాక అమూల్ పాలు తాగితే తెలివితేటలు వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి బుద్ధి రావాలని శ్రీరాముడిని, నందీశ్వరుడిని ప్రార్ధిస్తున్నాని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment