సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారడంలేదని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే, అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారమే కమిటీల నియామకం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని పీఏసీ ఛైర్మన్‌గా చేస్తే ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు.
కాగా, మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ చైర్‌ను కొందరు ప్రతిపక్ష నేతలు అప్రతిష్ట పాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్లో ఆక్రోశం కనిపిస్తోంది. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని పీఏసీ చైర్మన్‌గా చేస్తే ఎందుకు తప్పు పడుతున్నారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ బేధాలు ఉంటే మాకు ఏం సంబంధం?. పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ.. తాను బీఆర్‌ఎస్ సభ్యుడేనని స్పష్టంగా చెప్పారు. సంఖ్యా బలంపరంగా బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురికి అవకాశం ఇచ్చారు.
బీఆర్‌ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీరు ముగ్గురేనా? మిగతా వారు లేరా?. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరికెపూడి గాంధీ కలిశారు. అందులో తప్పేముంది?. ప్రజాస్వామ్యం గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గతంలో సీఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార్క ఉంటే కేసీఆర్ ఓర్వలేకపోయారు. ఎమ్మెల్యేల అంశంలో హైకోర్టు ఏం చేయాలో చెప్పలేదు. నాలుగు వారాల్లో ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పింది. లెజిస్లేచర్ వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంత వరకు ఉంటుందో అనే అంశంపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇంత సమయంలో నిర్ణయం జరగాలని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. పీఏసీ చైర్మన్ అరికేపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నాను తనకు పీఏసీ పదవి ఇచ్చారని గాంధీ అన్నారు. అలాగే, సీఎం రేవంత్‌ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఆలయానికి సంబంధించిన శాలువానే తనకూ కప్పారని అన్నారు. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పీఏసీ చైర్మన్ హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా.. వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా అని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో తనపై విమర్శలు చేసే వారికి ఇదే నా సవాల్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు ఏం చేశారో గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment