సాక్షి, సచివాలయం: ప్రజల్లో సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్ట్ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లగచర్ల ఘటనలో కలెక్టర్‌ను చంపే కుట్ర జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో ఎవ్వరనీ వదిలిపెట్టం. దీనిపై విచారణ జరుగుతోంది. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్టు వారి పార్టీ నాయకులే అంటున్నారు. కేటీఆర్ పదే పదే అరెస్ట్ అనడం కేవలం సానుభూతి కోసమే. ఆయనను అరెస్ట్ చేయడానికి మేమేమీ కుట్రలు చేయడం లేదు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయి.
గత పదేళ్లలో రైతులకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోంది. సన్న వడ్లు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం సేకరించిన వారం రోజులలోపే ఐదు వందల బోనస్ రైతులకు అందుతాయి. రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలి. ఇప్పటి వరకు 33కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రాసెస్ జరిగింది. 66 లక్షల ఎకరాల్లో 140 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.
కాళేశ్వరంతోనే నీళ్లు ఇచ్చాం అన్నారు.. మరి ఈ ధాన్యం ఉత్పత్తి కాళేశ్వరంతో కాలేదు కదా?. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ తమ బాధ్యతలను విస్మరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలి. గత ప్రభుత్వ హయంలో గుట్టలకు, పుట్టలకు, చెట్లకు రైతుబంధు ఇచ్చారు. ఇలాంటి విధానాన్ని మేము కొనసాగించం.. నిజమైన రైతులకు న్యాయం చేస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment