సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యింది. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్‌ఎస్‌కు కౌంటరిచ్చారు.
ఇక, తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు. పార్టీలోకి చేరుతాం అంటే ఎవరైనా వద్దంటారా?. ఫిరాయింపులను ప్రోత్సహించాలని మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. గతంలో బీఆర్‌ఎస్ వేరే రకంగా చేరికలకు పాల్పడింది. భయపెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను అప్పుడు బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.
కానీ, ఇప్పుడు మేము ఎవరిని బెదిరించడం లేదు. వారికి వారే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారు. నైతికంగా బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు మమ్మల్ని అడిగే హక్కు, మా గురించి మాట్లాడే హక్కు లేదు. సంక్షేమం, అభివృద్ధిలో చెప్పిన పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పాత్రదారులుగా ఉండేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలి’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment