సాక్షి, హైదరాబాద్: కమీషన్ల కక్కుర్తి, నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్ పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోందని.. కాళేశ్వరంపై తెలంగాణ సమాజం నిజాలు తెలుసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
‘‘మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ సీఎం.. కుంగిపోయినప్పుడూ ఆయనే సీఎం.. మేడిగడ్డ బ్యారేజ్‌కు ప్రమాదం జరిగితే.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. కమీషన్ల కుక్కర్తి తప్ప ఇది మరొకటి కాదు. పాలమూరు-రంగారెడ్డిపై 31 వేల కోట్లు ఖర్చుపెట్టి.. ఒక్క ఎకరానికి నీరు అందించలేదు. కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్లే ఈ దుస్థితి’’ అంటూ ఉత్తమ్ ఎండగట్టారు.
‘‘బీఆర్‌ఎస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ టీమ్ శాశ్వతంగా దెబ్బకొట్టారు. ప్రాజెక్టు నాసిరకం అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని కమిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొదని కమిటీ చెప్పింది. కాళేశ్వరం బీఆర్‌ఎస్ నేతలకు పిక్నిక్ స్పాట్‌లా మారింది.’’ అని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు.
‘‘35 వేల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను రిడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీఆర్‌ఎస్ 94వేల కోట్లు ఖర్చు చేసింది. 90 వేలకు పైగా ఖర్చు చేసినా కాళేశ్వరం పూర్తి కాలేదు.. పూర్తి కావాలంటే 1లక్ష 40 వేల కోట్లకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మైంటనేన్స్ కోసం ప్రతి ఏటా 15వేల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు పూర్తి అయితే అన్ని ఖర్చులు కలిపి ప్రతీ ఏటా 25 వేల కోట్లు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ సెక్టార్‌ను సర్వనాశనం చేసింది.’’ అని ఉత్తమ్ మండిపడ్డారు.
కాళేశ్వరం సర్వనాశనం చేసి మళ్లీ ఇప్పుడు బీఆర్‌ఎస్ దొంగ నాటకాలు ఆడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ముందుకు వెళ్తాం. బ్యారేజీలో నీళ్లు వదలాలి చెప్పింది కాబట్టే మేము గేట్లు ఎత్తి పెట్టాం. మేడిగడ్డ వద్ద నీళ్లు స్టోరేజ్ చేస్తే గోదావరి పరివాక ప్రాంతాలు మునుగుతాయి. కేటీఆర్ కంటే ఎన్‌డీఎస్‌ఏకు తెలివి ఎక్కువ ఉంది అనుకుంటున్నాం. మీరే నాశనం చేసి.. మళ్ళీ మీరే పంప్‌లను ఆన్ చేస్తా అనడం విడ్డూరం. ఎల్లంపల్లి వద్ద రెండు మూడు రోజుల్లో పంపింగ్ మొదలు పెడతాం. అన్నారం 11 మీటర్ల వద్ద పంపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అన్నారం బ్యారేజి వద్ద 5 మీటర్లకే బుంగలు పడింది.’’ అని ఉత్తమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment