
తాడితోట (రాజమహేంద్రవరం): ఆవ భూముల్లో ఆవ గింజంత కూడా అవినీతి జరగలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..
► రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారానికి తెరతీశారు.
► హైదరాబాద్‌లో కాపురం ఉంటూ.. అవినీతి సొమ్ముతో అజీర్తి చేసి ఆవలింత వచ్చినప్పుడల్లా అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు.
► 30 లక్షల ఇళ్లు నిర్మించడం కోసం ఒక మోడల్ హౌస్‌ను సందర్శిస్తే కోట్లాది రూపాయలు అవినీతి జరిగిపోయిందని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి.
► అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం 54 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే కోర్టును ఆశ్రయించి పేదోళ్లకు అందకుండా ప్రయత్నిస్తున్నారు.
► ఆవ భూముల్లో రూ.500 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అక్కడ ఖర్చు చేసిందే రూ.170 కోట్లు అని తెలుసుకోవాలి.
► ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని ప్రధాన మంత్రికి చంద్రబాబు ఉత్తరం రాశారు. ఆధారాలు చూపించాలని డీజీపీ అడిగితే.. మీరెవరు అడగడానికి అని ప్రశ్నించిన వారే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం విడ్డూరం.
Comments
Please login to add a commentAdd a comment