సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ
మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు.
అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది.
చదవండి: కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్
ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు
మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం
మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్‌కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment