మీడియాకు ఆధారాలు చూపుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
సాక్షి, ధర్మవరం టౌన్: ‘మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే అన్ని సౌకర్యాలతో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పేరుతో ఎంఐజీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఇస్తోంది. అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో ఎల్లో మీడియా, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి దుష్ప్రచారానికి తెరతీయడం సిగ్గుచేటు’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంఐజీ లేఅవుట్‌లపై ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా చూపించారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీఐఐసీ కుణుతూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఎకరా రూ.4.75 లక్షలు నిర్ణయించి 126 ఎకరాలను ఎంఐజీ లేఅవుట్ కోసం సేకరించిందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ప్రకారం పరిహారం అందించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఇక జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్ కింద ఇస్తున్న ప్లాట్లు అభివృద్ధి చేయకుండానే ఇచ్చేస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లేఅవుట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందని, ఈనెల 17న టెండర్ కూడా పూర్తి చేశామన్నారు. ఈ ఏడాదిలోపే లేఅవుట్‌లో సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు.
ఇవేవి తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద జల్లే వార్తలు రాయడం దారుణమన్నారు. ఎంఐజీ సమీపంలో తాను కూడా వెంచర్ వేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నానని ఆరోపిస్తున్నారని, వాస్తవంగా ఎంఐజీ లేవుట్ ప్రతిపాదన రాక ముందే తాను వెంచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంఐజీ లేఅవుట్ ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోందని, ఆ లేవుట్ రావడం వల్ల ప్రైవేటు వెంచర్‌లకు నష్టం తప్ప లాభం ఉండదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: (Railways: ఇకపై ఆ రైళ్లలో జనరల్ ప్రయాణం)
సూరీ... ప్రమాణానికి సిద్ధమా ?
ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సూరి చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. తాను ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో బ్రిటీష్ కాలంలోనే పట్టాలు పొందిన రైతులకు సంబంధించిన 25 ఎకరాలను కొనుగోలు చేశానన్నారు. ఎన్‌ఓసీ లేకుండానే వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వం 575 జీఓ ఇచ్చిందని వివరించారు. ఇవన్నీ పక్కన పెట్టి వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించిన ఆర్‌హెచ్, డైక్లాట్, రైతుల వివరాలను మీడియాకు అందించారు. తాను కొనుగోలు చేసిన భూమిలో రూ.25 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మిస్తే రూ,కోట్లతో ఇంటి నిర్మాణం చేపట్టానని ఆరోపించడం హేయమన్నారు.
రూ.7.50 లక్షల వ్యయంతో కొన్న చిన్నబోటును చెరువులోకి తీసుకెళ్తే... స్టీమర్లు కొన్నారని సూరి చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. గత లాక్‌డౌన్‌లో హార్స్‌రైడింగ్ నేర్చుకునేందుకు తాను, తన స్నేహితులు అనంతపురం నుంచి గుర్రాలను అద్దెకు తెచ్చుకుంటే... రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని సూరి ఆరోపించారని మండిపడ్డారు. తుంపర్తి పొలంలో నాగమ్మ దేవాలయాన్ని ఆక్రమించానని, గుప్తనిధులు తీశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాగమ్మ కట్ట వద్ద ఉన్న వేప చెట్టు స్థలాన్ని వదిలి కంచె వేసిన ఫొటోలను, చెరువు ఆక్రమించలేదని నిరూపించే శాటిలైట్ చిత్రాలను మీడియాకు అందించారు. వరదాపురం సూరికి దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలో గానీ, తాడిపత్రి చింతల రాయుడు దేవాలయంలో గానీ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment