ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు | MLA Raghunandan Rao Reaction Attack On MP Kotha Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు

Published Tue, Oct 31 2023 3:13 AM | Last Updated on Tue, Oct 31 2023 3:13 AM

MLA Raghunandan Rao Reaction Attack On MP Kotha Prabhakar Reddy - Sakshi

పాలమూరు: దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్‌రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్‌రావు చెప్పారు.

రాజు ఫేస్‌బుక్‌ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్‌ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్‌ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్‌రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement