సాక్షి, హైదరాబాద్ : ముషీరాబాద్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. గతంలో గాంధీ నగర్‌లో భారీ మెజారిటీలతో పార్టీని గెలిపించారని, మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. గాంధీనగర్ డివిజన్ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అనేక అనుమానాల మధ్యలో రాష్ట్రంలో పాలన ప్రారంభించామన్నారు. కరెంట్ సమస్యను కేవలం ఆరు నెలల్లో పరిష్కారం అయ్యేలా చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 67 వేల కోట్ల రూపాయలతో పనులు చేశామని, ఒక ఆలోచనతో పాలన ముందుకు సాగిస్తున్నామన్నారు.
‘ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తోంది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అందడం లేదు. 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ ఎలా ఉందో ఆలోచించుకోవాలి. కానీ కొందరు ఇవాళ హిందూ- ముస్లీం అంటున్నారు. కొన్ని పార్టీల నేతలు హైదరాబాద్‌కు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారు. వరద సాయం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడిగితే లేఖ రాలేదని సమాధానం వచ్చింది. కానీ హోంశాఖ నుంచి పలు రాష్ట్రాలకు సాయం అందింది. పేద వర్గాలు ఆకలి కోసం ఇబ్బందులు పడొద్దని రేషన్ పెంచి ఇచ్చాం. బీజేపీ మాటలు నమ్మితే మనమే ఇబ్బందులు పడుతున్నాం. కార్పొరేటర్ మీద కోపం ఉండొచ్చు కానీ కేసీఆర్‌ను చూసి గెలిపించాలి. టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తుంది. బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అని ఓటు అడుగుతున్నారు’ అని కవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment