అవి కిరాయి పలుకులే: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం
బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్తగా తప్పుకున్న ప్రశాంత్ కిశోర్
బిహార్‌లో చెల్లని కాసులా మారడంతో చంద్రబాబుతో డీల్
వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి
సీఎం జగన్ సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్
పొత్తులో సీట్ల లెక్క తేలాక చంద్రబాబు, పవన్ నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ అట్టర్ ఫ్లాప్
ఉనికి కాపాడుకోవడానికే పీకేతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుకుతున్న పలుకులన్నీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలికిస్తున్న చిలుక పలుకులేనని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలనే ఆయన వల్లిస్తుండటాన్ని బట్టి అవన్నీ కిరాయి పలుకులు, కిరాయి ప్రకటనలేనని స్పష్టమవుతోందన్నారు. గతంలో పార్టీలకు వ్యూహకర్తగా డబ్బులు తీసుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఒక్కో స్టేట్‌మెంట్‌కు లెక్కగట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ పేర్కొనటాన్ని గుర్తు చేశారు.
ఆ తర్వాత ఆయన బిహార్‌లో రాజకీయ అరంగేట్రంతో పాదయాత్ర చేశారన్నారు. అయితే బిహార్‌లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ డీల్ కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు. లోకేశ్ గతంలో ప్రశాంత్ కిశోర్‌ను వెంటబెట్టుకుని ఉండవల్లిలోని అక్రమ కట్టడంలో చంద్రబాబుతో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రశాంత్ కిశోర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తరఫున పనిచేస్తున్నామని ఐ–ప్యాక్ ప్రకటించిందన్నారు.
రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సర్వే చేసేందుకు అవసరమైన వ్యవస్థ ప్రశాంత్ కిశోర్‌కు లేదన్నది తద్వారా స్పష్టమవుతోందన్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందన్నారు. టైమ్స్‌నౌ, జీన్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని వెల్లడవడమే అందుకు నిదర్శనమన్నారు.
ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం సముద్రంలా పోటెత్తారని, ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభ అతి పెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులే విశ్లేషించారన్నారు. టీడీపీ–జనసేన పొత్తులో సీట్ల పంపకాలు తేలాక తాడేపల్లిగూడెంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యిందని గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు టీడీపీ ఉనికి కాపాడుకోవడం కోసం ప్రశాంత్ కిశోర్‌తో తనకు అలవాటైన రీతిలో అబద్ధాలను మాట్లాడిస్తున్నారంటూ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment