ఎంఐఎం తరపున గెలిచిన అరుణ | MP: Aruna Upadhyay Won Ward Member In MP Local Polls | Sakshi
Sakshi News home page

ఎంఐఎం తరపున వార్డు మెంబర్‌గా గెలిచిన అరుణ

Published Thu, Jul 21 2022 12:06 PM | Last Updated on Thu, Jul 21 2022 12:16 PM

MP: Aruna Upadhyay Won Ward Member In MP Local Polls - Sakshi

భోపాల్‌: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు.  తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. 

మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్‌లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్‌గావ్‌ మున్సిపల్‌ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. 

ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్‌ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్‌ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్‌ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement