సాక్షి, జనగామ: తనపై ఫిర్యాదు నమోదవ్వడంపై జనగామ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన కూతురు తుల్జాభవాని సంతకం ఫోర్జరీ చేయలేదని పేర్కొన్నారు. కూతురు పేరు మీదనున్న ఫ్లాట్ ఆమె పేరుతోనే ఉందని స్పష్టం చేశారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల ల్యాండ్ తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని, ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని తెలిపారు.
ఉప్పల్ పీఎస్ పరిధిలో తుల్జాభవాని పేరుపై 125 నుంచి 150 గజాల వరకు భూమి ఉందని, అందులోనూ ఎలాంటి ఫోర్జరీ జరగలేదన్నారు. అయితే దీనిని తన కుమారుడు నామమాత్రంగా కిరాయికి ఇచ్చారని అది కూడా తనకు తెలియకుండానే జరిగిందని తెలిపారు. అంతేగాని ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదని చెప్పారు. సదరు ఆస్తి కూతురు పేరు మీదే ఉండటం వల్ల కిరాయి కూడా ఆమెకే వెళ్తుందని తెలిపారు.
ఇది కుటుంబ సమస్య అని.. ఏ కుంటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమేనని తెలిపారు. కూతురిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తనపై ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా గిట్టనివారు దీనిని వివాదంగా మార్చారని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారని, తమ అధినేత సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని పేర్కొన్నారు. వివాదలు సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!
కాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జాభవని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్‌కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment