Jangaon BRS Seat Muthireddy Slams Palla Cries Infront Media - Sakshi
Sakshi News home page

కారులో టికెట్ల లొల్లి: మీడియా ముందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. పల్లాపై ఆగ్రహం.. కేసీఆర్‌కు విన్నపం

Published Sat, Aug 19 2023 3:14 PM | Last Updated on Sat, Aug 19 2023 4:42 PM

Jangaon BRS seat Muthireddy Slams Palla Cries Infront Media - Sakshi

సాక్షి, జనగామ:  నియోజకవర్గపు టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అంటూ ప్రచారం జరుగుతుండడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఓవైపు ముత్తిరెడ్డి అనుచరులు పల్లాకి టికెట్‌ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కి రచ్చ చేస్తున్న వేళ.. మరోవైపు ముత్తిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే  కంటతడి పెట్టారాయన.  

‘‘బుక్కెడు బువ్వ దొరకని జనగామ నియోజక వర్గాన్ని భారత దేశానికే అన్నం పెట్టేలా తీర్చిదిద్దాను. గెలిచే నియోజకవర్గాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిస్ట్రబ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ఏడేళ్ళ లో జనగామకు ఏం చేశావో చెప్పు.  పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి అసలేం చేశారు?. పైగా ఇప్పుడు  డబ్బులు పంచి ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల ముందు డబ్బులు పంచి హుజురాబాద్‌లా జనగామను మార్చాలనుకున్నావా?.అధినేతను, పార్టీని డిస్ట్రబ్‌ చేయడం పల్లా మానుకోవాలి అని ముత్తిరెడ్డి హితవు పలికారు.

నా బిడ్డను బజారుకు ఎక్కించావ్‌
‘‘ఇంటెలిజెన్స్ అంటు నీ కాలేజీ వాళ్ళతో సర్వే చేసి పార్టీని నాశనం చేస్తున్నావు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కొడుకు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు.  (కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అని చెప్పుకొచ్చారాయన). నా కుటుంబంలో కలహాలకు పల్లానే కారణం. నా బిడ్డ ను బజారుకు ఎక్కించింది పల్లానే. పల్లా జనగామ నాయకుల్ని మిస్ గైడ్ చేసి టూరిజం ప్లాజాకు తీసుకొచ్చారు. పార్టీ కి విరుద్దంగా గ్రూప్ లను ఎందుకు ప్రోత్సాహిస్తున్నావు పల్లా?. పార్టీ కి విరుద్దంగా పని చేయడం మానుకోండి. కేసిఆర్ వెంట 22ఏళ్ళు ఉన్నా,  ఉద్యమంలో పల్లా నీ పాత్ర ఏంటీ? అంటూ నిలదీశారాయన.

కేసీఆర్‌కు రిక్వెస్ట్‌
‘‘పల్లా చేసే అధర్మ పని మానుకోవాలి. సీఎం ప్రకటించే వరకు ఎందుకు ఆగడం లేదు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంస్కారానికి నమస్కారం. ఉద్యమకారులను డిస్టర్బ్‌ చేస్తే కేసిఆర్ సహించరు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కేసిఆర్ ను జనగామ ప్రజలు మరువలేరు. నాటి నుంచి నేటి వరకు కేసిఆర్ కు సైనికుడిగా పని చేశాను. 2004లో సామాజిక పరంగా టిక్కెట్ లభించకపోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేసిఆర్ నినాదంతో ప్రచారంతో 60 వేల ఓట్లు తీసుకువచ్చా. 2009లో పాలకుర్తికి పోయినా కేసిఆర్ అడుగుజాడల్లో పనిచేశాను. 2014, 2018 లో కేసిఆర్ ఆశీస్సులతో జనగామ నుంచి పోటీ చేసి గెలిచి ప్రజా సేవలో నిమగ్నమయ్యాను. కేసిఆర్ సైనికుడిగా ఉంటా. ఆయన ఏ పని చెప్పినా చేస్తా.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, మొదటి లిస్ట్‌లోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినతి చేశారు.

బోరున విలపించిన సర్పంచ్‌
ప్రెస్‌ మీట్‌ సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని వడ్లకొండ సర్పంచ్ బొల్లం శారద పట్టుకుని బోరున విలపించారు. ‘కేసీఆర్ సార్ మమ్మల్ని ఏడ్పించకండి. ఒక్కసారి ముత్తిరెడ్డి కి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే మేమొచ్చి మాట్లాడుతాం సార్. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి కేసీఆర్‌ సార్’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement