
సాక్షి, చిత్తూరు/శ్రీరంగరాజపురం: ‘విద్యా దీవెనతో తల్లులను జగన్ మోసం చేస్తున్నారు. ఇదొక పనికి మాలిన పథకం. గతంలో ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యానికి నేరుగా ఫీజులు చెల్లించేది. జగన్ దీన్ని తల్లిదండ్రులపైకి నెట్టాడు. చాలీ చాలని డబ్బులిచ్చి తల్లిదండ్రులపై విద్యా భారాన్ని పెంచాడు. దీనివల్ల అనేక మందికి పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 16వ రోజు Ôశనివారం శ్రీరంగరాజపురం మండలంలో సాగింది. ఉదయం ఎస్‌ఆర్ పురం హనుమాన్ ఆలయం విడిది కేంద్రంలో యాదవ సామాజిక వర్గంతో, తర్వాత దిగువ మెడవడ ఎస్టీ కాలనీ వాసులతో ముఖాముఖి నిర్వహించారు.
అనంతరం పిళ్లారికుప్పం, వెంకటాపురం గ్రామాల మధ్య వెంట నడుస్తున్న వారిని ఉత్సాహ పరిచేందుకు కొంత దూరం పరుగెత్తారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ పూర్తి చేసినా, సర్టిఫికెట్లు చేతికందక యువత నిరుద్యోగులుగా ఇళ్లకే పరిమితం అవుతున్నారన్నారు. అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాలన్నీ పేపర్లకే పరిమితమని విమర్శించారు. ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని.. డీఎస్సీ, ఏపీపీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు ఇస్తానని మాట తప్పారన్నారు. బిహార్‌కు కూడా పెట్టుబడులు వస్తుంటే ఏపీకి మాత్రం రావడం లేదన్నారు. టీడీపీ హయాంలో బీసీలను అన్ని విధాలా ప్రోత్సహించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment