
సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 823 కావడంతో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోలైన ఓట్లన్నింటిని కలిపేస్తారు. అందులో నుంచి చెల్లుబాటు కాని ఓట్లను తీసివేస్తారు. అ తర్వాత 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కడతారు. మొదటి రౌండ్లో 600 ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఆ తర్వాతి రౌండ్‌లో మిగిలిన 223 ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కించిన అనంతరం ఫలితాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అభ్యర్థి గెలుపును ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపు పత్రాన్ని అందజేస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు డిపాజిట్లు రావాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే 823 ఓట్లలో సుమారు 138 ఓట్లు వచ్చిన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కుతాయి. లేనిపక్షంలో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవాల్సి వస్తుంది.
మొదటి ప్రాధాన్యత ఓటుతోనే..
పోలింగ్ సరళిని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోయే అవకాశముంది. ప్రాధాన్యత ఓటు విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు ఓటములు తేలాలంటే పోలైన ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే పోలైన ఓట్ల సంఖ్యలో సగాని కంటే +1 అన్నమాట. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 ఓట్లు (రెండు పోస్టల్ ఓట్లతో కలిపి) పోలయ్యాయి. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 413 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల సరళిని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ వస్తే, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిర్వహించే అవకాశం లేదు.
ఆరుగురు కౌంటింగ్ ఏజెంట్లు..
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు పాసులు జారీ చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి ఒక్కో అభ్యర్థికి ఆరుగురు కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. వీరికి ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్‌ను కూడా కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తారు. పాలిటెక్నిక్ కళాశాల రెండో గేట్ నుంచి కౌంటింగ్‌హాల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment