విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని వాళ్లకు ఆయన స్పష్టం చేశారాయన.
సీఎం జగన్‌ను కలిసిన సందర్భంలో.. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశాం. అంతేకాదు.. స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.
.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ పార్టీది రాజీలేని ధోరణి. ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి..
.. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత YSRCPకే ఉంది. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పై మా వైఖరిలో ఏ మార్పు లేదు. మేము కన్సెంటు ఇవ్వలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ అండగా ఉంది. ఇకపై కూడా ప్రభుత్వ సహకారంతోనే ఉద్యమం జరుగుతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకూడదని మేం కోరుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment