ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌ కూటమి వైపు కేజ్రీవాల్‌.. ఆమ్‌ అద్మీ వ్యూహమేంటీ? | Opposition Meet: What AAP Strategy Behind Alliance With Congress | Sakshi
Sakshi News home page

ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌ కూటమి వైపు కేజ్రీవాల్‌.. ఆమ్‌ అద్మీ వ్యూహమేంటీ?

Published Tue, Jul 18 2023 8:31 PM | Last Updated on Tue, Jul 18 2023 9:27 PM

Opposition Meet: What AAP Strategy Behind Alliance With Congress - Sakshi

ప్రతిపక్ష కూటమి సమావేశానికి హాజరైన ఆమ్‌ ఆద్మీ పార్టీపై అందరి దృష్టి ఉంది. అటు ఢిల్లీతో పాటు ఇటు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారం హస్తగతం చేసుకున్న ఆప్.. కాంగ్రెస్‌తో జట్టు కట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

2013 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడించడం మాత్రమే కాదు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఓటమికి కూడా ఆప్ నడిపిన ఆంటీ కరప్షన్ క్యాంపెయిన్ ప్రధాన కారణం. ఇక ఢిల్లీ తరువాత పంజాబ్‌లోనూ ఆప్‌ కాంగ్రెస్‌ కంట్లో నలుసుగా మారింది. ఆపై అక్కడ కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించింది. ఉత్తరాఖండ్‌, గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడంలో ఆప్ ప్రధాన పాత్ర పోషించింది. హిమాచల్‌లో ఎలాగోలా అధికారం దక్కినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడా ఆప్‌ నుంచి చికాకు తప్పలేదు. 

చాలాకాలంగా బీజేపీకి బీటీమ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆప్‌ను విమర్శిస్తోంది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల కూటమి సమావేశానికి హాజరయ్యి ఆప్‌ అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆప్‌ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మీటింగ్‌కు హాజరవడానికి ఒక బలమైన కారణం కనిపిస్తోంది. ఢిల్లీ పరిపాలనా అధికారాలను నియంత్రించే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తే తాము కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరవుతామని గతంలో ఆప్‌ ప్రకటించింది. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ నేతలు ఆప్‌ ట్రాప్‌లో పడొద్దని.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించొద్దని అధిష్ఠానాన్ని కోరాయి. అయితే బెంగుళూరు సమావేశానికి సరిగ్గా నాలుగురోజుల ముందు కాంగ్రెస్ అధిష్టానం.. ఆప్‌కు మద్దతుగా ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తానని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాస్త ఆశ్చర్యకరమైనదే అయితే అది అనాలోచితం మాత్రం కాదు. 
చదవండి: Opposition Meet: కాంగ్రెస్‌ పెద్దన్నగా మారిందా?

కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఆప్‌ను డిఫెన్స్‌లోకి నెట్టినట్టయింది. ఇక ఒప్పుకున్నాక.. వెనక్కి తగ్గే అవకాశం ఆప్‌కు లేకుండా పోయింది. వెనక్కి వెళ్లితే ఆప్‌కు ప్రతిపక్షాల్లో మద్దతు కరువయ్యే ప్రమాదం ఉంది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బలం కూడగట్టాలంటే కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ మద్దతు అవసరం. అందుకే ఆప్ నాయకులు ఇష్టం లేకున్నా బెంగుళూరు మీటింగ్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగారు. 

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను కట్టడి చేయాలన్నది కాంగ్రెస్ లాంగ్‌టర్మ్ స్టాటర్జీ. ముఖ్యంగా ఆప్‌ మాకు మిత్రపక్షమే అని మెసేజ్ ఇస్తే రాజస్థాన్,  మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కలిసి వస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. ఆర్డినెన్స్ పేరుతో ఆప్‌ను దువ్వితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందవచ్చని హస్తం నేతల ధీమా. 

అయితే ఆర్డినెన్స్‌కు మద్దతు సంపాదించడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌ను పోటీచేయకుండా చూడాలనేది ఆప్ వ్యూహం.  అందుకే బెంగుళూరుకు పిలిచి సాండల్ సోప్‌తో కాకా పడుతున్నా... కాంగ్రెస్ పార్టీది ధృతరాష్ట్ర కౌగిలి అనే భయం మాత్రం ఆప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ చాణక్యం వర్క్ అవుట్ అవుతుందా? కేజ్రీ వ్యూహం పని చేస్తుందా? మరో ఆరు నెలల్లో తేలిపోతుంది.
-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ
విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement