నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైందా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పైటింగ్ స్టార్టయిందా? మళ్ళీ నేనే అంటున్న పాల్వాయి స్రవంతి. ఒప్పందం ప్రకారం తనకే ఇవ్వాలంటున్న మరో నేత. ఇద్దరి పంతంతో తలలు పట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇంతకీ మునుగోడు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. మొన్నటి ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా అధికార బీఆర్ఎస్, బీజేపీల అంగ, అర్థ బలాలకు ఎదురొడ్డి నిలబడి కూడా 24 వేల ఓట్లను సాధించింది. ఉప ఎన్నికలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న కసితో కాంగ్రెస్ కేడర్ సిద్ధమవుతోంది. అయితే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య మొదలైన టికెట్ పోరు కార్యకర్తల్ని కన్ఫూజన్‌కు గురి చేస్తోందట. టికెట్ తనదంటే తనదని ఇద్దరు నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం మునుగోడు కాంగ్రెస్‌లో కలవరం రేగుతోంది.
మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతికి సీనియర్ల మద్దతు ఉంది. ఉప ఎన్నికలో టిక్కట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చలమల్ల కృష్ఱారెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు. ఉప ఎన్నికలో ఓడిపోయినా పార్టీ పరువు కాపాడాను కాబట్టి తనకు మరో అవకాశం ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారట.
చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్‌ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది?
పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి
మరోవైపు గతంలోనే టికెట్ వచ్చినట్లు వచ్చి చేజారిందని, దీనికి తోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట చల్లమల్ల కృష్ణారెడ్డి. ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తే సాధారణ ఎన్నికల్లో తనకు సహకరిస్తానని స్రవంతి మాట ఇవ్వడం నిజం కాదా అని కృష్ణారెడ్డి గుర్తు చేస్తున్నారట. రేవంత్ ఆశీస్సులు కృష్ణారెడ్డికి పుష్కలంగాఉండటంతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈసారి కృష్ణారెడ్డికే మద్దతుగా నిలుస్తున్నారట. దీంతో తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో చలమల్ల కృష్ణారెడ్డి నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ కమిటీలను ప్రకటించేలా రేవంత్‌పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు చల్లమల్ల. ఈ పరిణామాలతో పాల్వాయి స్రవంతి అలెర్ట్ అయ్యారు. నేరుగా గాంధీభవవ్‌ను వెళ్లి మునుగోడు తాజా పరిణామాలను సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లారట. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా కమిటీలను ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారట.
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే జిల్లాలోని నకిరేకల్లోని మండల కమిటీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యంతో నిలిచిపోయాయి. దీంతో స్రవంతి ఒత్తిడితో మునుగోడులో మండల కమిటీలు ఆగిపోయాయి. పార్టీ కోసం పనిచేసిన వారికే మండలాధ్యక్ష పదవులు ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారు. అయితే తన అనుచరుడు కృష్ణారెడ్డి మాటను కాదని స్రవంతి సూచించిన వారికి రేవంత్ పదవులు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.
మొత్తంగా ఇద్దరి నేతల మధ్య నెలకొన్న వర్గపోరు మునుగోడు కాంగ్రెస్ రాజకీయాలను రసవత్తరంగా మార్చాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.
చదవండి: కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment