సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైకు ముందు తన నటనతో అందరినీ అలరిస్తున్నారు. ఈరోజు(ఆదివారం) ఊకదంపుడు ఉపన్యాసంతో హడావుడి చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.
కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్ తాపత్రయపడుతున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల విద్వేషం తప్ప పవన్ మాటల్లో ఇంకేమీ లేదు. సమాజం కోసం పవన్ మాట్లాడింది ఏమీలేదు. పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎవరో సినిమా రైటర్ రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదివాడు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి తొలగించారు. ఇప్పటంలో ఏమీ కూలలేదని అక్కడి వాళ్లే చెబుతున్నారు. ఇప్పటంలో ఎవ్వరినీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటం గ్రామం పరువు తీసింది ఎవరు?. కోర్టు మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రాలేదు. పవన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. కోర్టు విధించిన జరిమానా ఎవరు చెల్లిస్తారు?. చంద్రబాబు ప్రభుత్వంలో పొలాలను నాశనం చేసినప్పుడు పవన్‌కు ఏం గుచ్చుకోలేదా?.
చంద్రబాబు రైతులకు అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమయ్యారు?. చంద్రబాబు కాళ్ల దగ్గర చోటుంటే చాలన్నది పవన్ ఆలోచన. ప్రజలకు తన పరిపాలనతో సీఎం వైఎస్ జగన్ మరింత చేరువయ్యారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియదు. మోదీతో పవన్ ఏం మాట్లాడితే మాకెందుకు?. రూట్‌మ్యాప్ మోదీ ఇవ్వాలి అంటారు. ఒక పార్టీ స్థాపించిన వ్యక్తి రూట్ మ్యాప్ కోసం ఇంకొకరిని అడుగుతారా?. మోదీ కాళ్లు పట్టుకునేది నువ్వే.. పారిపోయేది నువ్వే. సీఎం వైఎస్ జగన్ మీద పడి ఏడ్చేది ఎవరు?. 2014లో పార్టీ పెట్టినా పోటీ చేయలేక పారిపోయింది ఎవరు?. 2024లో వైఎస్సార్‌సీపీకి 175 సీట్లు వస్తే నువ్వు చూస్తూనే ఉంటావ్ పవన్. అందరి హీరోల అభిమానులు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటారు.
పవన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. పవన్ విధానాలు చూసే ప్రజలు ఓటేయలేదు. 2024లో కూడా ప్రజలు ఓటు వేయరు. పవన్ మాటలు, వీడియోలు మ్యూజియంలో పెట్టాలి. మంచి పరిపాలన అందిస్తే సినిమాలు చేసుకుంటా అన్నది పవనే. ప్రతీ ఎన్నికలకూ పవన్ ఒక్కో జెండా మారుస్తారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక వ్యూహం.. లేకుంటే మరో వ్యూహం. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్. ఓ వీకెండ్ పొలిటీషన్ పవన్’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment