రాజ్‌కోట్/గాంధీనగర్: జాతిపిత మహాత్మాగాంధీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశ నిర్మాణానికి గత ఎనిమిదేళ్లలో నిజాయతీగా కృషి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పేదల గౌరవాన్ని కాపాడేందుకు నిబద్ధతతో పని చేశామని అన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 26న ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని
దేశానికి సేవలు అందించడంలోఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని ఉద్ఘాటించారు. దేశంలో ఏ ఒక్క పౌరుడూ సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా మసలుకున్నామని అన్నారు. ప్రధాని మోదీ శనివారం సొంత రాష్ట్రం గుజరాత్‌లో నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, సాధించిన ఘనతలను వివరించారు.
అంకెలు కాదు.. సాక్ష్యాధారాలు
‘‘పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతతో కూడిన భారత్‌ను గాంధీజీ కోరుకున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం అనేవి నిత్య జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు. స్వదేశీ విధానాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావాలని చెప్పేవారు. వాటన్నింటి కోసం ప్రభుత్వం కృషి చేసింది. గత ఎనిమిదేళ్లలో 3 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చాం. కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. 9 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందజేశాం.
2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం, 6 కోట్ల కుటంబాలకు కుళాయి నీరు సదుపాయం కల్పించాం. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 50 కోట్ల మంది ఉచిత వైద్యానికి అర్హత పొందారు. ఇవన్నీ కేవలం అంకెలు కాదు. పేదల సంక్షేమం పట్ల మా అంకితభావానికి సాక్ష్యాధారాలు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే నినాదంతో దేశ అభివృద్ధికి కొత్త దిశను నిర్ధారించాం.
ఎరువుల కొరత లేకుండా చర్యలు: మోదీ
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరిగాయని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైతన్నలను బలోపేతం చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని వివరించారు. గుజరాత్‌లో ‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో నిర్మించిన నానో యూరియా ప్లాంట్‌ను మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. మరో 8 ప్లాంట్లు రాబోతున్నాయని, దీనివల్ల ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుందని చెప్పారు. పాడి సహకార రంగంలో గుజరాత్ అభివృద్ధి సాధించిందని కితాబిచ్చారు. గాంధీనగర్‌లో ‘సహకార్ సే సమృద్ధి’ సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడారు.
పేదరికాన్ని అనుభవించా
దేశంలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేశాం. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న మహిళకు ఆర్థిక సాయం అందించాం. కరోనా బాధితులకు వైద్య సేవలు కల్పించాం. అర్హులైన భారతీయులందరికీ కరోనా టీకా ఉచితంగా అందించాం. పేదరికం గురించి నేను పుస్తకాలు, టీవీల ద్వారా తెలుకోలేదు. పేదరికాన్ని స్వయంగా అనుభవించా. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న కారణంగా గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించింది. 2014 కంటే ముందు (యూపీఏ ప్రభుత్వ హయాంలో) రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఫైల్‌ను ఢిల్లీకి పంపిస్తే వెంటనే తిరస్కరణకు గురయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాజ్‌కోట్‌లో నేను ప్రారంభించిన ఈ ఆసుపత్రి రోగులు లేక ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరూ అనారోగ్యం బారినపడకూడదు. అందుకోసం చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని మోదీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment