చిన్నారి కోసం.. ప్రధాని మోదీ సాహసం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన గుజరాత్ పర్యటనలో భాగంగా కాన్వాయ్‌లో వెళ్తూ.. ఉన్నట్టుండి తన వాహనాన్ని ఆపారు. ఏమైందో, ఎందుకు ఆగారో ఎవరికీ కాసేపు అర్థం కాలేదు. రోడ్డుకు ఇరువైపులా ఆయన కోసం చాలామంది అభిమానులు చేతులు ఊపుతూ ఆయనను అభినందిస్తున్నా, ప్రధాని దృష్టిని ఆకట్టుకున్నది మాత్రం నాలుగేళ్ల చిన్నారి. ఎందుకంటే, ఆ పాప ఉన్నట్టుండి రోడ్డు మీదకు వచ్చేసింది. అటువైపుగా ప్రధాని కాన్వాయ్ వాహనాలు వెళ్తున్నాయి. దాంతో ఒక్కసారిగా అంతా అప్రమత్తమయ్యారు. రెండు రోజుల గుజరాత్ పర్యటన ముగించుకుని సూరత్ విమానాశ్రయానికి వెళ్లిపోయే సమయంలో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో.. వాళ్లు ఆ పాపను ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. చిన్నారిని ఆప్యాయంగా హత్తుకుని, పాపతో నాలుగు మాటలు మాట్లాడి.. ఆమెకు టాటా చెప్పి ఆ తర్వాత వెళ్లిపోయారు. దాంతో అక్కడున్న జనమంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనిస్తూ ’మోదీ.. మోదీ‘ అని నినదించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇలా ప్రోటోకాల్‌ను పక్కన పెట్టడం, భద్రతా నిబంధనలను పెద్దగా పట్టించుకోకపోవడం ఇది మొదటిసారి కాదు. ఇలాంటి వాటి వల్ల ఆయన భద్రతా సిబ్బందికి చెమటలు పడుతుంటాయి. ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆయన ట్రాఫిక్ నియంత్రణలు ఉన్న వీవీఐపీ మార్గంలో కాకుండా.. సాధారణ మార్గంలో వెళ్లిపోయారు. అటువైపు మార్గంలో పెద్దగా పోలీసు భద్రత కూడా ఏమీ లేదు. గడిచిన తొమ్మిది నెలల్లో మోదీ తన సొంత రాష్ట్రానికి రావడం ఇది ఎనిమిదో సారి. ఈ సంవత్సరం నవంబర్‌లోపు అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో గుజరాత్ మీద దృష్టి పెట్టారు. ఐదోసారి కూడా గుజరాత్‌లో వరుసగా గెలవాలని బీజేపీ గట్టి పట్టుతో ఉంది.