
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్‌లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి లేవనెత్తారు. వన్ నేషన్–వన్ –ఎలక్షన్ –వన్ ఓటరు లిస్ట్ ఉండాలని, లేదంటే ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతోందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగానున్న బీజేపీ కార్యకర్తలతో ఆన్‌లైన్‌లో ప్రధాని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాధికులు, సంపన్నులు ఓటు వెయ్యకపోవడం పట్ల మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. 1951–52లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 45% పోలింగ్ జరిగితే 2019 నాటికి 67శాతానికి పెరిగిందన్నారు.
మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమని, కానీ ఇంత తక్కువ ఓటింగ్ జరగడానికి గల కారణాలేంటో రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికల గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘ చర్చలు చేస్తారు కానీ , పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం లేదన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా క్షేత్రస్థాయిలో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు (పన్నా ప్రముఖ్స్) కనీసం 75% పోలింగ్ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఓట్ల శాతం పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల్ని ప్రధాని అభినందించారు.
75% ఓటింగ్ జరిగేలా చూడాలి
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 75శాతానికి పెరిగేలా చర్యలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తాను హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి సందేశాన్ని పంపారు. కోవిడ్–19తో బాధపడుతూ హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన తన సందేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో 75% ఓటింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు అంటే హక్కు కాదని, తమ బాధ్యతని భావించిన రోజు దేశంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
ఓటింగ్ తప్పనిసరి చేయాలి..
దేశంలో ఓటు వెయ్యడాన్ని తప్పనిసరి చేయా లని 86 శాతం మంది ముక్తకంఠంతో కోరారని ఒక సర్వేలో వెల్లడైంది. పబ్లిక్ యాప్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ జాతీయ ఓటరు దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్‌పై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నాలుగు లక్షల మందికిపైగా పాల్గొన్నారు. వారిలో 86 శాతం మందికి పైగా ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 80శాతం మందికిపైగా చెప్పారు. దేశంలో తక్కువగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్‌ని తప్పనిసరి చేయాలా అని అడిగిన ప్రశ్నకు 86శాతం మందికి పైగా చేసి తీరాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment