కేసీఆర్‌ వస్తే.. వద్దన్నాం: మోదీ సంచలన వ్యాఖ్యలు  | PM Narendra Modi Fires On CM KCR In BJP Praja Garjana Sabha - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వస్తే.. వద్దన్నాం: మోదీ సంచలన వ్యాఖ్యలు 

Published Wed, Oct 4 2023 3:25 AM | Last Updated on Wed, Oct 4 2023 9:14 AM

PM Narendra Modi Fires On KCR At BJP Praja Garjana Sabha - Sakshi

రైతులు ఇచ్చిన పసుపు కొమ్ముల దండ, పసుపు మొక్కతో ప్రధాని మోదీ , ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

మోదీ.. మరో పటేల్‌లా వెలుగులు తెస్తాడు 
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్‌ స్టేట్‌కు స్వాతంత్య్రం రాలేదు. నిజాంలను తరిమికొట్టేందుకు అందరూ భయపడ్డారు. కానీ ఓ గుజరాతీ బిడ్డ సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వచ్చాకే హైదరాబాద్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు మళ్లీ ఇంకో గుజరాతీ బిడ్డ మోదీ వచ్చాడు. అతడు మీ కోసం మరో పటేల్‌లా అభివృద్ధితో ప్రజల జీవితాల్లోకి 
వెలుగులు తెస్తాడు. 

నువ్వేమైనా రాజువా.. కూర్చోబెట్టడానికి? 
ఒకట్రెండు సార్లు కేసీఆర్‌ నన్ను కలిశారు. తాను తప్పుకోవాలనుకుంటున్నానని, తన కొడుకు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నానని నాతో చెప్పారు. కేటీఆర్‌ను పంపిస్తా, ఆశీర్వదించాలని కోరారు. అప్పుడు నువ్వేమైనా రాజువా, మహారాజువా? నీ తర్వాత నీ కొడుకు కూర్చోవడానికి? అని ప్రశ్నించాను. ఎవరిని సీఎంగా కూర్చోబెట్టాలో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పాను. నేను ఇలా చెప్పిన రోజు నుంచి కేసీఆర్‌ నన్ను కలవలేదు. కనీసం నా కళ్లలోకి చూసే సాహసం కూడా చేయడం లేదు. ఆ తర్వాతి రోజుల్లో నాపై, బీజేపీపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు, ఆరోపణలు మొదలుపెట్టారు. మీడియా వాళ్లు కూడా ఈ తేదీలు చెక్‌ చేసుకోవచ్చు. నా పక్కన అవినీతిపరులకు చాన్స్‌ లేదు.     
– మోదీ

నిజామాబాద్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి 48 మంది కార్పొరేటర్లు గెలిచాక.. ఎన్డీయేలో చేరతామంటూ సీఎం కేసీఆర్‌ తనను కలసి విజ్ఞప్తి చేశారని.. కానీ బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశానని ప్రధాని మోదీ చెప్పారు. కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేద్దామని అనుకుంటున్నా ఆశీర్వదించాలని చెబితే.. కొడుకును సీఎం చేయడానికి ఇదేం రాచరికం కాదని స్పష్టం చేశానని పేర్కొన్నారు.

తర్వాతి రోజుల్లో కేసీఆర్‌ తనపై, బీజేపీపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారన్నారు. మంగళవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ ‘ఇందూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఒక రహస్యం చెప్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
‘ఇందూరు ప్రజాగర్జన’కు హాజరైన జనం 

ఇదీ రహస్యమంటూ.. 
‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుస్తుందని వారు ఊహించలేదు. అప్పుడు కేసీఆర్‌కు మా సపోర్ట్‌ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను ఎయిర్‌పోర్ట్‌కు వస్తే పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని, గజమాలలు తీసుకుని స్వాగతం పలికేందుకు వచ్చేవారు. అవన్నీ గుర్తున్నాయా? కానీ ఇప్పుడు కేసీఆర్‌ ఎందుకు రావడంలేదో తెలుసా?.. 

అవినీతిపై ప్రశ్నిస్తే దూరం జరిగారు.. 
కేసీఆర్‌ నన్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చారు.. పెద్ద పెద్ద శాలువాలు తెచ్చారు.. అప్పుడు ఎంతో ప్రేమ చూపించారు. అది కేసీఆర్‌ క్యారెక్టర్‌ కాదని నేను అప్పుడే అనుకున్నా.. కేసీఆర్‌ ఎన్డీయేలో భాగస్వామి అవుతానని నాతో చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. మోదీ మీతో జతకట్టబోడని స్పష్టంగా చెప్పాను. హైదరాబాద్‌లో విపక్షంలో కూర్చోవడానికి సిద్ధమే. కూర్చుంటాం.. కేసీఆర్‌ సర్కార్‌ మా కార్యకర్తలపై జులుం చేసినా సహిస్తాం.

కానీ తెలంగాణ ప్రజలను దగా చేయనివ్వబోమని స్పష్టంగా చెప్పాను. కేసీఆర్‌ ఎన్డీయేలోకి రావడానికి కూడా నిరాకరించాను. ముఖ్యమంత్రికి మతి పోయింది. నేను బీఆర్‌ఎస్‌ అవినీతి గురించి ప్రశ్నించాను. అప్పటి నుంచి దూరంగా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడటం, ప్రజలను పట్టించుకోకపోవడంతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఈసారి బీఆర్‌ఎస్‌ ఓటమి తథ్యం. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ హామీలను నమ్మొద్దు 
ప్రజలు బీఆర్‌ఎస్‌ హామీలను నమ్మొద్దు.. మళ్లీ వచ్చే ఐదేళ్లు లూటీ చేసే అధికారం వారికి ఇవ్వొద్దు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ ఒకటే. ఎన్నికల కోసం కాంగ్రెస్‌ హామీలు గుప్పిస్తోంది. ప్రజలు వాటిని నమ్మితే తర్వాత పశ్చాత్తాప పడాల్సిందే. నిరుదోగ భృతి ఇస్తామన్న బీఆర్‌ఎస్‌ దానిని పూర్తిగా విస్మరించింది. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత హామీలు మరిచిపోవడం, తమ జేబు నింపుకోడం, కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడమే వారి పని. తెలంగాణలోనూ బీజేపీ అ«ధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌ పాపాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తాం. 

కేంద్ర నిధులను బీఆర్‌ఎస్‌ లూటీ చేసింది 
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులు కేటాయించింది. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లూటీ చేసింది. లూటీ చేయడమే బీఆర్‌ఎస్‌ నేతలకు తెలిసిన మంత్రం. బీఆర్‌ఎస్‌ వాళ్లు ప్రజాతంత్రాన్ని దోపిడీ తంత్రగా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చారు. లక్షలాది కుటుంబాల ఆకాంక్షలను కేసీఆర్‌ కుటుంబం కబ్జా చేసింది. ఆ కుటుంబాన్ని ఎవరూ అడగే పరిస్థితి లేదు. కొడుకు, బిడ్డ, అల్లుడు, మరో కొడుకు, అత్తంటి వారు.. ఇలా అంతా తెలంగాణను లూటీ చేస్తున్నారు. కొడుకు, అల్లుడు కలసి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. తెలంగాణలో ఆ ఒక్క కుటుంబమే బాగుపడింది.

ఆ ఒక్క కుటుంబానికి కొందరు సేవ చేస్తున్నారు. అలాంటి వారికి పదవులు ఇస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడినవారిని, నిరుద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. కుటుంబ పాలనతో యువత తీవ్రంగా నష్టపోతోంది. అదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులకు కూడా అన్నింట్లో అవకాశాలు కల్పిస్తోంది. లక్షల మందికి వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అపాయింట్‌మెంట్‌ లెటర్లు సైతం అందజేశాం. నీతిఆయోగ్‌ తాజా నివేదిక చూస్తే.. దేశంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఇలాంటి విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది మోదీ సంకల్పం. ఇతర రాజకీయ పార్టీలు కూడా పేదల అభ్యున్నతికి కృషి చేయాలని కోరుతున్నాను. 
 
దక్షిణాదికి అన్యాయం చేసినదే కాంగ్రెస్‌ 
దక్షిణ భారతానికి అన్యాయం చేసిందేనదే కాంగ్రెస్‌ పార్టీ. అలాంటి వారిని దక్షిణాది అక్కున చేర్చుకుంటుందా? దక్షిణ భారతానికి ఏం చేశారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి. తమిళనాడు, కేరళ, తెలంగాణలోని కాంగ్రెస్‌ మిత్రపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై తమ వైఖరి స్పష్టం చేయాలి. తమిళనాడు ప్రభుత్వం ఆలయాలను కబ్జా చేసింది. కానీ మైనారిటీల పూజాస్థలాలపై మాత్రం చేయి పెట్టే సాహసం చేయలేదు. 
 
అభ్యున్నతికి కృషి చేస్తాం.. ఆశీర్వదించండి 
నిజామాబాద్‌లో మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించా.. చాలా సంతోషంగా ఉంది. పసుపుబోర్డుతో నిజామాబాద్‌ రైతులతోపాటు దేశవ్యాప్తంగా రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది. కమలం పువ్వు ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు చేరుకుంటుంది. మీరు, మేం కలసి రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేద్దాం. కరోనా వస్తే ప్రపంచానికి వ్యాక్సిన్‌ పంపిన దేశం మనది. మోదీ ఇచ్చే గ్యారంటీకి అది నిదర్శనం. రాష్ట్రంలో జరగబోయే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలి..’’ అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement