అవినీతే కాంగ్రెస్‌ ఊపిరి | PM Narendra Modi launches scathing attack on Congress in Chhattisgarh | Sakshi
Sakshi News home page

అవినీతే కాంగ్రెస్‌ ఊపిరి

Published Sat, Jul 8 2023 4:45 AM | Last Updated on Sat, Jul 8 2023 7:57 AM

PM Narendra Modi launches scathing attack on Congress in Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌లో మహిళా లబ్ధిదారుతో ప్రధాని మోదీ

రాయ్‌పూర్‌/గోరఖ్‌పూర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ ఊపిరి, ముఖ్య సిద్ధాంతం అవినీతేనని పేర్కొన్నారు. అవినీతి లేకుండా ఆ పార్టీ బతకలేదని విమర్శించారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధిని అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని ఆ పార్టీ ఏటీఎంలా మార్చేసుకుందని వ్యాఖ్యానించారు. అవినీతికి కాంగ్రెస్‌ గ్యారెంటీ అయితే, అవినీతి పరులపై చర్యలకు తనదీ గ్యారెంటీ అని అన్నారు. ‘కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దుష్పరిపాలనకు ఆదర్శంగా మారింది. అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచింది. ప్రజల హక్కుల్ని లాగేసుకుని, రాష్ట్రాన్ని లూటీ చేసి, నాశనం చేసేందుకు పూనుకుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’అని ప్రధాని నిప్పులు చెరిగారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మద్య నిషేధం తదితర 36 వాగ్దానాలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయింది. మద్య నిషేధానికి బదులుగా కోట్లాది రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడింది. ఈ డబ్బంతా కాంగ్రెస్‌ ఖాతాలోకే చేరింది. ఒక్క మద్యానికే కాదు. ప్రతి శాఖలోనూ అవినీతే. అవినీతి కాంగ్రెస్‌కు ఊపిరిగా మారింది. అది లేకుండా ఆ పారీ్టకి శ్వాస ఆడదు. అవినీతే కాంగ్రెస్‌ ముఖ్య సిద్ధాంతం’అని అన్నారు.

కాంగ్రెస్‌ అవినీతికి గ్యారెంటీ అని నేను విమర్శిస్తే కొందరు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానర్థం, అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లే. కాంగ్రెస్‌ అవినీతికి గ్యారెంటీ అయితే, అవినీతిపై చర్యలకు మోదీ గ్యారెంటీ’అని ఆయన స్పష్టం చేశారు. అవినీతి పరులు, గతంలో పరస్పరం దూషించుకున్నవారు ఇప్పుడు దగ్గరవుతున్నారంటూ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు.

ఇటువంటి వాటికి భయపడేది లేదన్నారు. ‘తప్పుడు పనుల్లో మునిగి తేలేవారు తప్పించుకోలేరు. నా దగ్గర ఉన్నదంతా మీరు (ప్రజలు), ఈదేశం ఇచి్చనవేనని ధైర్యంగా చెబుతున్నా. నాపై కుట్రలు పన్నుతున్న వారికి, నా సమాధి తవ్వాలని చూస్తున్న వారికి భయపడను. భయపడితే మోదీనే కాను’అని ప్రధాని చెప్పారు. రాష్ట్రం నుంచి నక్సలిజంను లేకుండా చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని తెలిపారు. నక్సల్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 70కి తగ్గిపోయిందన్నారు.  

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంకేర్‌ జిల్లా అంతగఢ్‌– రాయ్‌పూర్‌ రైలుకు వర్చువల్‌గా జెండా ఊపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కార్డులను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న వారికి ఆధునిక సౌకర్యాలు కలి్పంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన రాయ్‌పూర్‌– ధన్‌బాద్‌ ఎకనామిక్‌ కారిడార్, రాయ్‌పూర్‌–విశాఖపట్టణం ఆర్థిక కారిడార్‌ ప్రాజెక్టులతో ఈ ప్రాంత రూపురేఖలే మారనున్నాయన్నారు.

గీతా ప్రెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని
శుక్రవారం ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. గీతా ప్రెస్‌ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతా ప్రెస్‌ కేవలం పుస్తకాలను ముద్రించే ముద్రణాలయం కాదు, ప్రజల విశ్వాసం, దేవాలయమని పేర్కొన్నారు. మహాత్మాగాం«దీకి గీతా ప్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గీతా ప్రెస్‌ ఆధ్వర్యంలో నడిచే కల్యాణ్‌ మేగజీన్‌ కోసం ఆయన వ్యాసాలు రాసే వారని చెప్పారు. ప్రధాని రెండు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. అనంతరం  సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. అక్కడ రూ.12 వేల కోట్ల 29 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.  గత ప్రభుత్వాలహయాంలో ఏసీ గదుల్లో కూర్చుని సంక్షేమ పథకాలను తయారు చేసే, ప్రభావం ఏమిటనే దానిపై అప్పటి నాయకులకు అవగాహన లేదని ప్రధాని  అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement