న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రజాస్వామిక నాయకుడని అభివర్ణించారు. మునుపెన్నడూ లేని రీతిలో మోదీ హయాంలో కేంద్ర మంత్రివర్గం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తోందని, ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారని అన్నారు. మోదీ నిరంకుశ నాయకుడన్న ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. పదవులు, హోదాలతో సంబంధం లేకుండా ఎవరు చెప్పినా ఓపికతో వింటారని, ఇతరుల సలహాలు, సూచనలను గౌరవిస్తారని చెప్పారు.
ఇంత ఓపికగా వినే నేతను తాను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆదివారం సంసద్ టీవీ చానల్ ఇంటర్వూ్యలో అమిత్ షా మాట్లాడారు. దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి.. రాజకీయంగా నష్టం ఉన్నా ఏమాత్రం వెనుకాడబోరని చెప్పారు. ప్రజల సంక్షేమం, జాతి భద్రత కోసం ఆయన ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మోదీ నిరంకుశుడు కాదు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే నాయకుడు అని తేల్చిచెప్పారు.
అదే మోదీ ప్రత్యేకత
ప్రధానమంత్రిని, ఆయన పనితీరును తాను చాలా దగ్గరగా గమనిస్తున్నానని అమిత్ షా అన్నారు. మోదీ ఇతరులు చెప్పేది చక్కగా వింటారని, తక్కువ మాట్లాడుతారని, అందరి అభిప్రాయాలు తెలుసుకొని సహనంతో సరైన నిర్ణయం తీసుకుంటారని ఉద్ఘాటించారు. చిన్నస్థాయి ఉద్యోగి లేదా కార్మికుడు చెప్పేది కూడా వినడం మోదీ ప్రత్యేకత అని కొనియాడారు. ప్రధాని క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు, దేశంలో మార్పు తీసుకురావడానికే పదవిలో ఉన్నానని సదా భావిస్తుంటారని వివరించారు.
గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ ఎన్నెన్నో విజయాలు సాధించారని అన్నారు. అధికారం తమ జన్మహక్కు అని కొన్ని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని అమిత్ షా విమర్శించారు. మోదీ ఈ పరిస్థితిని మార్చేశారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరిగితే, వైఫల్యాలు ఉంటే ప్రజలకు వివరించాలి తప్ప వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment