బిజ్నూర్: అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డంకులుగా నిలిచారని ప్రత్యర్ధులపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అలాంటివారంతా రైతు నేత చౌదరీ చరణ్‌సింగ్‌కు వారసులమని తప్పుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆన్‌లైన్ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉండగా తమ గ్రామాలకు ఎంత మేర విద్యుత్‌ను అందించారో సమాజ్‌వాదీ నేతలను ప్రశ్నించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. వీరంతా నకిలీ సమాజ్‌వాదీలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. యూపీ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ, ఎస్‌పీ కూటమి చరణ్ సింగ్ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ, రైతుల ప్రధాని చరణ్‌సింగ్‌కు తామే వారసులమని ప్రచారం చేసుకుంటున్నాయి.
ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకే తమ ప్రభుత్వాలు కట్టుబడిఉన్నాయని మోదీ చెప్పారు. ఐదేళ్లలో పంచదార రైతులకు సుమారు 1.5 లక్షలకోట్ల బకాయిలు చెల్లించామని, గత రెండు ప్రభుత్వాలు ఈ పని చేయలేదని గుర్తు చేశారు. ప్రతిపక్షాల హయంలో యూరియా బ్లాక్‌మార్కెట్లో దొరికేదని, తాము అధికారంలోకి వచ్చాక గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వాల కన్నా రెట్టింపు మోతాదులో యోగి ప్రభుత్వం గోధుమలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో రైతుల జనాభా, అందునా చెరుకు రైతుల హవా అధికం. అందుకే వారిని ఆకట్టుకునేందుకు ప్రధాని తమ ప్రభుత్వాలు చేసిన రైతు ఉపయోగ పనులను గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు సమస్యలను సృష్టించి సానుభూతి రాజకీయాలు చేసేవని, వారి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మోదీ విమర్శించారు. ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment