ఆర్మూరు నియోజకవర్గం
ఆర్మూరు నియోజకవర్గంలో మరోసారి ఆశన్నగారి జీవన్ రెడ్డి టిఆర్‌ఎస్ పక్షాన ఘన విజయం సాదించారు.ఆయన 28795 ఓట్ల ఆదిక్యతతో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఆకుల లలితపై గెలుపొందారు. ఆకుల లలిత ఎన్నికలు పూర్తి కాగానే టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం విశేషం. జీవన్ రెడ్డికి 72125 ఓట్లు రాగా, లలితకు 43330 ఓట్ల వచ్చాయి. కాగా బిజెపి తరపున పోటీచేసిన పి.వినయ్ కుమార్ రెడ్డికి 19వేలకు పైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. గెలిచిన టిఆర్‌ఎస్ అభ్యర్ది రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆర్మూరులో తొలి నుంచి రెడ్డి సామాజికవర్గం నేతలే అత్యదికంగా గెలిచారు.
2014లో ఆర్మూరులో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి ని జీవన్ రెడ్డి ఓడిరచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల నాటికి సురేష్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిపోయి తదుపరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ఐ అధికారంలోకి వచ్చాక స్పీకరు పదవిని చేపట్టిన కె.ఆర్. సురేష్‌రెడ్డి ఇంతకుముందు బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందగా 2009లో ఆయన బాల్కొండలో కాకుండా ఆర్మూరు నియోజకవర్గానికి మారి పోటీ చేయగా, స్వయాన ఆయన మేనత్త ఆలేటి అన్నపూర్ణమ్మ చేతిలో అనూహ్యంగా పరాజితులయ్యారు. ఆర్మూరు నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిది సార్లు గెలిస్తే, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు,టిఆర్‌ఎస్ మూడుసార్లు, సోషలిస్టుపార్టీ ఒకసారి గెలుపొందాయి.
ఆర్మూరు నుంచి సంతోష్‌రెడ్డి నాలుగుసార్లు గెలుపొందారు. రెండువేల నాలుగులో టిఆర్‌ఎస్ పక్షాన గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన అసమ్మతి నేతగా మారి శాసనమండలి ఎన్నికలలో విప్ ఉల్లంఘన కింద అనర్హతకు గురయ్యారు. అయితే తీర్పు వెలువడడానికి ఒక రోజు ముందు ఈయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు. సంతోష్‌రెడ్డి గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో కూడా సభ్యునిగా ఉన్నారు. కొంత కాలం జడ్‌పి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన తుమ్మల రంగారెడ్డి బాల్కొండలో మరోసారి గెలిచారు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత పొందారు. మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య ఒకసారి, మాజీ మంత్రి జి.రాజారామ్ మరోసారి ఇక్కడ నుంచి గెలిచారు.
అంజయ్య ముషీరాబాద్‌లో మూడుసార్లు, రామాయంపేటలో మరోసారి గెలిచారు. అలాగే లోక్‌సభ, రాజ్యసభలకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయన కొంతకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. రాజారామ్ బాల్కొండలో మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన కూడా జలగం, మర్రిచెన్నారెడ్డి, అంజయ్యల క్యాబినెట్‌లలో పనిచేసారు. 1999లో ఇక్కడ గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో బాన్స్‌వాడ నుంచి గెలిచారు. 2014,2018లలో టిఆర్‌ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1985లో ఆర్మూరులో గెలిచిన మహీపాల్‌రెడ్డి, 1994, 2009లో గెలుపొందిన అన్నపూర్ణమ్మలు భార్యాభర్తలు. మహిపాల్‌రెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు.
ఆర్మూరు గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment