సినిమాల్లో అంతే.. కొన్ని సీన్లను, కొంతమంది నటులను షూటింగులో షూట్ చేస్తారు. ఆ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయని, రష్ చూసి సంబరపడతారు. ఆ సీన్లు తనకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని, తననుంచి నటనను పిండుకోవడంలో డైరెక్టర్ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదని, అయితే అంతా తాను ప్రెస్‌మీట్‌లో చెప్పలేనని మిగతాది వెండితెరమీద చూస్తేనే అర్థం అవుతుందని నటీనటులు చెప్పుకుంటారు.
తీరా చూస్తే సినిమా రిలీజయ్యాక ఆ సీన్లు ఉండవు.. ఏంది వయ్యా అంటే సినిమా నిడివి ఎక్కువైనందున ఎడిటింగులో ఆ సీన్లు తీసేశామని, చల్లగా చెబుతారు. సరే.. సినిమా లెంగ్త్ ఎక్కువైంది.. కొంత కట్ చేయాలి.. దానికి నేను నటించిన సీన్లనే తీసెయ్యాలా.. ఇంకేమీ లేవా అనే ప్రశ్నకు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాధానం ఉండదు.. ఇప్పుడు జనసేన అనే పొలిటికల్ సినిమాలో నాగబాబు పాత్ర కూడా అలాగే లేచిపోయింది. మొన్నటివరకు అంతా తానే అంటూ హడావుడి చేయడం.. సీనియర్ నాయకులూ.. మంత్రులు.. ఎంపీలను సైతం అచ్చం జబర్దస్త్ కామెడీ గాళ్ళను ఎటకారం చేసినట్లు చేయడం.. ట్విట్టర్లో పోస్టింగులు పెట్టడం.. దీంతో బాగా ఓవర్ యాక్షన్ చేసిన నాగబాబు ఇప్పుడు సరైన టైం వచ్చేసరికి గాయబ్ అయ్యారు.
వాస్తవానికి నాగబాబును అనకాపల్లి ఎంపీగా ముందు ఫోకస్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన అచ్యుతాపురం వద్ద ఇల్లు కూడా రెంటుకు తీసుకుని కొన్నాళ్ళు కార్లు.. నౌకర్లు.. జెండాలతో హడావుడి చేసారు. దీంతో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉండడమే కాకుండా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయడంతోబాటు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టారు. వారితో అదీ ఇదీ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. ఏమంటే నిధులు.. విరాళాల గురించి మాట్లాడారు. వంద రూపాయల నుంచి ఎంత వరకైనా విరాళం ఇవ్వవచ్చని చెబుతూ నేరుగా క్యూ ఆర్ కోడ్‌ను సైతం చూపించారు. అంటే ఆయనకు పార్టీ ఇచ్చిన అసలు బాధ్యత విరాళాలు సేకరించడం అని కేడర్‌కు అర్థమైంది. దాంతోబాటు ఆయనకు క్యాడర్ మీద అధికారము చెలాయించడం తప్ప బాధ్యత కూడా లేదని వాళ్లకు మెల్లగా తెలిసొచ్చింది.
ఇదిలా ఉండగానే అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు లేదని.. వేరే ఎవరికో కేటాయిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో నాగబాబు చిన్నగా ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్లిపోయారు. సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ చెప్పేసారు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్లకు సైతం దొరకడం లేదని అంటున్నారు. ఫోన్లు ఏకంగా స్విచ్చాఫ్ చేసేశారని.. ఎక్కడున్నారోకూడా తెలియడం లేదని అంటున్నారు. ఆయనమీద నమ్మకంతో కొంతమంది భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మరికొంతమందికి టిక్కెట్ హామీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక నాగబాబు పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి పరారైనట్లు చెబుతున్నారు. తనతో కేవలం హడావుడి మాత్రమే చేయించారని.. టిక్కెట్ విషయానికి వస్తే తనకు ఏమీ లేకుండా చేసారని ఆయన అవమానంగా ఫీలవుతున్నట్లు తెలిసింది.
ఇక జనసేనకు రెండంటే రెండే ఎంపీ స్థానాలు దక్కడంతో అందులో ఒకటి మచిలీపట్నం కాగా అక్కడి నుంచి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాకినాడ కాగా అక్కడ పవన్ బరిలో ఉంటారని అంటున్నారు. దీంతో నాగబాబుకు ఎంపీ సీట్ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే దానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. చేస్తే ఎంపీగానే అనేది ఆయన ఆలోచన. గతంలో 2019 లో కూడా ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా టిక్కెట్ కూడా లేకపోవడంతో తాను కేడర్‌కు మొహం చూపించలేక మొత్తం గాయిబ్ అయినట్లు చెబుతున్నారు. రెండు వారాలుగా ఆయన ఎక్కడా సభలు.. సమావేశాల్లో కానరావడం లేదు. ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి విరాళాలు దండుకుని పారిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment