
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందించి ఉంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ బీఫామ్ ఇచ్చే దమ్ముందా అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణను బంగారుమయం చేసి ఉంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లోని 25–30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారంతా దొంగలని, ప్రజలను ఇబ్బందు లపాలు చేసేందుకే మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పొంగులేటి కోరారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి గ్రామపంచాయతీ మొదలు పార్లమెంటు వరకు కాంగ్రెస్ జెండాను రెపరెప లాడించాలని పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్న వారు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా.. అది ఇంకా 55 రోజులు మాత్రమేనని, బీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని పొంగులేటి చెప్పారు. ప్రచార కమిటీ కోచైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన పొంగులేటికి పార్టీ నాయకులు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ఘనస్వాగతం పలికారు. డీసీసీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మం, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.