సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్‌ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మైనారిటీలను అవమానించడమే..
ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్‌ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే
స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు.
రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు
రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని అన్నారు.
పార్టీ లో చేరికలు
బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment