
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని.. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేశ్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేరు కాబట్టే వారిద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చెప్పారు. నీతిబాహ్యంగా చంద్రబాబు మాట్లాడే మాటలు తెలుగు డిక్షనరీలో కూడా లేవని చెప్పారు. ప్రజలకు ఎన్నో చేస్తామని చంద్రబాబు చెబుతారని.. ఆయన చెప్పడమే తప్ప ఏదీ చేయడని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా చెబితే కచ్చితంగా చేస్తారన్నారు. సీఎం జగన్ నిజాయితీపరుడు కాబట్టే ఆయనను 11 ఏళ్లుగా తాను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వైఎస్ జగన్ ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాబును నమ్మి అమరావతి ప్రజలు కక్ష పెంచుకుంటున్నారని, ఇది వారికి మంచిది కాదని హితవు పలికారు. ‘ఇప్పటికీ చెబుతున్నా.. అమరావతి ప్రజలు చంద్రబాబును నమ్మొద్దు. ఒకసారి అమరావతి ప్రజలు నేరుగా సీఎం జగన్‌తో కలిసి మాట్లాడితే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది’ అని సూచించారు.
పవన్‌ని ప్రజలు నమ్మడం లేదు
పవన్ కల్యాణ్ ఎలాంటి ఫ్రూఫ్ లేకుండా మాట్లాడటాన్ని ప్రజలు నమ్మడం లేదని పోసాని కృష్ణమురళి అన్నారు. వ్యక్తిగత కక్షతో పవన్ మాట్లాడుతున్నారన్నారు.
బాబు పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ రాడు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు దొడ్డిదారిన కైవసం చేసుకున్నారని పోసాని ఎద్దేవా చేశారు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని చంద్రబాబు వదిలేశారని గుర్తు చేశారు. లోకేశ్‌కు జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతారని చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాడని తాను భావిస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment