
చీరాల టౌన్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దానిని తట్టుకోలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడూ పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం సొంత సామాజికవర్గ అభివృద్ధి కోసం మాత్రమే చంద్రబాబు పనిచేశారన్నారు.
చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, ఓటుతోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు.
రాష్ట్రంలో వైద్య విద్యకు పెద్దపీట వేయడంతోపాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని, అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టారని చెప్పారు. శాసనసభ, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment