
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. టీడీపీ నేత అనితకు కనీస అవగాహనలేదని విమర్శించారు. అలాంటి ఆమె సీఎం సతీమణి భారతి గురించి మాట్లాడుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజం చెప్పాలంటే అవన్నీ చంద్రబాబు మాట్లాడిస్తున్నవేనన్నారు. చంద్రబాబు చేసే నీతిమాలిన రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అందుకే టీడీపీ వారికి నిజాలు రాసే ‘సాక్షి’ని చూస్తే భయం పట్టుకుందన్నారు.
వారు తప్పులు, కుట్ర రాజకీయాలు చేశారు కాబట్టే వైఎస్ భారతిని చూస్తే భయమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబసభ్యుల గురించి చంద్రబాబు ఇష్టానుసారంగా తన చెంచాలతో మాట్లాడించవచ్చు కానీ, అదే మేం భువనేశ్వరి గురించి మాట్లాడితే వెక్కివెక్కి ఏడుస్తారని ఎద్దేవా చేశారు. మహిళలను మోసంచేయడం, వారిని వంచించడమే టీడీపీ నైజమని ఆమె ఎండగట్టారు. అది చంద్రబాబు నేర్పించిన విద్యే అని, అలా చాలామందిని అణిచివేసి, హింసించారన్నారు. డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆమె ప్రశ్నించారు.
సీఎంపై దుష్టచతుష్టయం విషం
ఇక సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారని, అందుకే దుష్టచతుష్టయం చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 అదే పనిగా ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా విషం చిమ్ముతున్నారని పోతుల సునీత ధ్వజమెత్తారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా రూ.1.65 లక్షల కోట్లను నేరుగా పేద ప్రజల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమచేశారని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు ఇకనైనా తన పద్ధతి మార్చుకోకపోతే, ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఆమె హెచ్చరించారు. మహిళలను ఎంతో గౌరవించి, ఆదరించే సీఎం జగన్ సతీమణిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె చెప్పారు. మరోసారి వైఎస్ భారతిపై నోరుజారితే సహించేదిలేదని పోతుల సునీత హెచ్చరించారు. 2024లో కూడా మళ్లీ టీడీపీ ఓటమి ఖాయమని, సీఎం జగన్ తిరిగి సీఎం కావడం తథ్యమని ఆమె చెప్పారు.